ఏకాదశ స్కంధము – బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువవచ్చుట

కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరమునకు విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు ‘ఈవేళ యింతమంది దేవతలు వచ్చారు. ఏమిటి విశేషం” అని అడిగాడు. అపుడు వాళ్ళు “ఈశ్వరా! రాక్షస సంహారం చెయ్యడం కోసమని మీరు వైకుంఠంనుండి బయలుదేరి యిక్కడకు వచ్చి కృష్ణుడు అనబడే పేరుతో కొంతకాలం అవతారం స్వీకరించి అందరికీ గొప్ప సులభుడవు అయ్యావు. గోపకులంలో పుట్టి గోవులు, గోపాల బాలురు, గోపకాంతలు అందరూ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నీవు వచ్చి నూట యిరువది అయిదు సంవత్సరములు పూర్తి అయిపొయింది. కాబట్టి ఇంక నీవు ఈ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరి నీ మూల స్థానమునందు ప్రవేశించవలసినది’ అని అడిగారు. అప్పుడు భగవానుడు ‘ఓహో! అయితే యింక నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమయినది. కాబట్టి మేమి అవతార పరిసమాప్తి చేస్తాను. తొందరలోనే బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను’ అని చెప్పి ఒకసారి మనసులో సంకల్పం చేశారు. ‘తాను వెళ్ళిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు. కాబట్టి ఈ యాదవుల కులం అంతా కూడా తనతోపాటే నశించిపోవాలి. మొత్తం కులనాషణం జరగాలి’ అని తలంచారు. తాను నాయకత్వమునందు ఉండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవులను ఎవరూ చెణకలేరు. మనకి కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యమును ఆవిష్కరిస్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదమును తీసుకువస్తుందో చూపిస్తారు. అటువంటి ప్రమాదంతో కూడిన పనిని యాదవులచేత చేయించారు.

విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనమునకు వచ్చుట

ఒకరోజున అసితుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భ్రుగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యుడు, అత్రి, వశిష్ఠుడు వంటి మహర్షులు అందరూ కృష్ణ పరమాత్మ దర్శనమునకు వచ్చారు. వారు ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రం చేత పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. వారందరూ కృష్ణ భగవానుడిని చూసి ఒకమాట అన్నారు. “నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉన్నదో అది నిరర్ధక మయిన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్నిటివైపు తిరుగుతారు. అలా తిరగడం వలన మనుష్య జన్మ నిరర్థకం అయిపోతుంది. ఆ తరువాత మరల ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళకి తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకోని, కేవలం దీనిని పోషించుకొని దీనితో అనుభవించిన సుఖమును సుఖమనుకొని గడిపివేస్తున్నారు. కానీ ఈ శరీరమును అరణ్యంలోకి వెళ్లి దాచుకున్నా యిది ఉండదు. వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమునందు మగ్నులై వెళ్ళిపోతున్నారు. అయితే ఈ కాలమునందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులు లేని గోపాల బాలురతో కలిసి నీవి తిరిగి, కౌగలించుకొని, ఆడి పాడి యింతమందిని తరింపజేశావు. కృష్ణా, నీ లీలలు రాబోవుతరంలో విన్న వారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవింద నామమును పలికిన వారిని గట్టెక్కించేస్తాయి. తండ్రీ, నీవు అంత గొప్ప అవతారమును స్వీకరించావు. ఇలాంటి మూర్తి మరల దొరకమంటే దొరకదు. అందుకని ఒక్కసారి నిన్ను కనులార దర్శిద్దామని వచ్చాము’. వాళ్ళకి అవతార పరిసమాప్తి అయిపోతున్నదని తెలుసు. ఈశ్వరా, నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా అని మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయారు.

ఈ సంసారమును దాటడానికి నీ పాదములు ఆధారము. వచ్చే కష్టములు తొలగిపోవడానికి నీ పాదములు ఆధారము. వేదములను నీ పాదములు ఆభరణములు. అటువంటి నీ చరణారవిందములను ఈ మాంసనేత్రముతో చూడాలని వచ్చాము. మరల యిటువంటి పాదములు మాకు దొరుకుతాయా” ఇవి ‘అంగనామంగనామంతరే మాధవం’ అని కొన్నివేలమంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాడిలా గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదములు ఈ శ్రీపాదములు. నీ పాదములను గోపాల బాలురు ‘మా కృష్ణుడు’ అని అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడు అని తెలియక ఆడుకున్న పాదములు. ఈ పాదములు వాళ్ళతో ఆడుకున్నపుడు వాళ్ళని తన్నిన పాదములు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి ఉవ్విళ్ళూరుతుందని తెలియక హేలగా ఆ పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాలబాలుర చేత ఒత్తబడిన పాదములు. ‘బ్రహ్మ కడిగిన పాదము’ అని బ్రహ్మగారి చేత కడిగించు కొనిన పాదములు. ఇంతమందిని తరింప జేసినా ఆ పాదములను ఒక్కసారి చూసి తరించి పోదామని వచ్చాము కృష్ణా’ అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు.

కృష్ణా! నీనామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని ముప్ఫయిమూడుకోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. కలియుగామునకు నీ నామమే రక్ష. నీది చాలా తేలికయిన నామము. గోవింద నామము నీ అంతట నీవు కష్టపడి సంపాదించుకున్న నామము. ఏడేండ్ల బాలుడవై ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండను ఎత్తి నిలబెట్టి గోపకులను రక్షించి నీవు సంపాదించుకున్న నామము గోవింద నామము. స్వామీ నిన్ను మరల ఎప్పుడు చూస్తాము! ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాము’ అని స్తోత్రం చేశారు. అపుడు కృష్ణ పరమాత్మ నవ్వి ‘నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి కారణం ఉంది. మీరు నన్ను చూసి తరించారు కదా! చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. ఇప్పడు నేను నా మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళండి. నదీ స్నానం చేయండి. అవతార పరిసమాప్తికి యాదవకుల నాశనం జరగాలి’ అని చెప్పాడు. ఈ మహర్షులందరూ వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని భగవంతుని కథలు తలుచుకుని పొంగిపోతున్నారు.

ఋషుల శాపము

వారికి కొద్ది దూరంలో వున్న కొందరు యాదవులు నవ్వుతూ తుళ్ళుతూ దూరం నుండి ఆ మహర్షులను చూశారు. కృష్ణుని ప్రచోదనం చేత వాళ్ళలో ఒక చిత్రమయిన బుద్ధి పుట్టింది. సాంబుడికి చీరకట్టి ఆడదానిలా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్లు చేసి వీళ్ళు ఏపాటి పరిజ్ఞానంతో చెపుతారో చూద్దామని అతడిని ఆ మహర్షుల దగ్గరికి తీసుకువచ్చారు. వారు సాంబుడిని మహర్షుల ముందు నిలబెట్టి ‘మీరు మహాత్ములు కదా! మీకు తెలియని విషయములు ఉండవు కదా. మీరు త్రికాలవేదులు. ఈ ఆడపిల్ల కడుపులో మగవాడు ఉన్నాడా, ఆడపిల్ల ఉందా కవలలు ఉన్నారా ఏ విషయం మాకు చెప్పండి’ అన్నారు. అనేసరికి వాళ్ళు ఆ స్త్రీవంక చూశారు. వాళ్లకి మహా ఆగ్రహం వచ్చింది. ‘మీకు బ భగవద్భక్తులతో పరాచికమా? కృష్ణుడు ఉన్న గడ్డమీద వున్న మీరు యిటువంటి పరిహాసం చేయడానికి సిగ్గుపడడం లేదా? ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణులను చూడగానే భక్తితో సేవిస్తారో, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు తలమీద చల్లుకుంటాడో అటువంటి కృష్ణుడితో కలిసివున్న మీకు యింతటి దుస్సాహసమా? మాతో పరిహాసమా? అని వాళ్ళు

“కొడుకూ కాదు, కూతురూ కాదు. క్షణం ఆలస్యం లేకుండా ఆమె కడుపునుంచి ముసలం ఒకటి పుడుతుంది. ఆరోకలి మీ అందరి తీట తీర్చేస్తుంది. దానితో మీ యదుకులం నాశనం అవుతుంది. పరిహాసం చేస్తున్న వారికి భయం వేసింది. ఇలా అన్నారేమిటని సాంబుడికి చీర విప్పారు. ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద యినుప రోకలి కిందపడింది. వాళ్లకి భయంవేసి ఆ రోకలి తీసుకుని పరుగుపరుగున కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి “మేము తెలియక మహర్షులతో పరిహాసం ఆడాము. వారు శపించారు. ఈ రోకలి పుట్టింది. ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావు? అని అడిగారు. అపుడు కృష్ణ పరమాత్మ – ఈమధ్య దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. యివి యదుకుల నాశానమును సూచిస్తున్నాయి. మీ అందరు ఆ ఇనప ముసలము చేత మరణిస్తారు. కాబట్టి దీనిని తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరం మీద ఈ ఇనుప ముసలమును అరగదీసి దీనిని సముద్రంలో కలిపివెయ్యండి’ అని చెప్పాడు. అపుడు వారు ఆ ముసలమును పట్టుకుని ఆ శిఖరం మీదికి వెళ్ళి ఆ ముసలమును అరగదీయడం మొదలు పెట్టారు. అది కరిగి కరిగి నల్లని తెట్టు కారుతోంది. ఆ తెట్టు తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నారు. అరగదియ్యగా అరగదియ్యగా చివరకు చిన్న ఇనప ములుకు ఒకటి మిగిలింది. ఆ ములుకు వల్ల ప్రమాదం ఏమీ లేదని భావించి ఆ ములుకును సముద్రంలోకి విసిరేశారు.

ఆ ములుకును ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకుందుకు సముద్రం దగ్గరకు వచ్చాడు. వాడి వలలో ఈ చేప పడింది. వాడు యింటికి వెళ్ళి ఈ చేపను కోశాడు. దాని కడుపులోంచి ఆ ఇనుప ముళ్ళు పడింది. ఆ ఇనపముల్లును తన బాణమునకు పెట్టుకుని ఆ బాణంతో దేనిని కొట్టాలా అని అడవిలో తిరుగుతున్నాడు.

కృష్ణుడు – ఉద్ధవుడు

ఈలోగా ‘అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి’ అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి ‘కృష్ణా! మేము నీతోకలిసి ఆదుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి’ అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత యింక వారు మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు.

‘ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికీ కోపమే. ప్రతివాడికీ కోర్కెలే. కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించేసుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయమును వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండే మనుష్యులకు రానురాను ‘వేదము ప్రమాణము కాదు – యజ్ఞయాగాదులు చేయకండి – వేదము చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పోషించకండి’ అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్ధమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి యిష్ట పడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటివలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును, సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వశులు అయిపోతారు.