ఉపసంహారం చేసిన తరువాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి వానిని ఒక పశువును కట్టినట్లు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథంమీద పెట్టాడు. పెట్టి విపరీతమయిన వేగంతో యుద్ధభూమి లోనికి వచ్చి రథమును అక్కడ నిలబెట్టాడు. అర్జునునికి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి వున్నాడు. అశ్వత్థామ వణికిపోతున్నాడు. కృష్ణుడు అన్నాడు ’అర్జునా, నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ. ఇతనిని బ్రాహ్మణుడని చూడకు. గురుపుత్రుడని చూడకు. సంహరించు. కుత్తుక కత్తిరించు’ అన్నాడు. అర్జునుడు మారుమాట్లాడలేదు. చంపలేదు.

ఇక్కడ ఉపనిషత్సారమును చెప్తున్నాడు. దానిని మీరు గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రమును వెయ్యమంటే వేశాడు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు.

త్రాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్ళినట్లు ద్రౌపదీదేవి శిబిరమునకు తీసుకువెళ్ళి అక్కడ పారవేశాడు. ’ద్రౌపదీ, వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను. తీసుకువచ్చి అశ్వత్థామను అక్కడ పడేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను’ అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒకతల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో గానీ తన పసుపుకుంకుమలకు గానీ, తన బిడ్డలకు గానీ, ఆపద తెచ్చిన వారిని క్షమించదు. అశ్వత్థామ తన అయిదుగురు బిడ్డలను చంపేశాడు. ఆయనను చూసి వెంటనే నమస్కారం చేసింది. ఆవిడ అంది ’మహానుభావా, అశ్వత్థామా, నా భర్తలైన ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులకు నీ తండ్రి గురువు. అనేకమైన అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు. ఆ కారణం చేత వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ”ఆత్మావైపుత్రనామాసి’ తండ్రి తన కొడుకు రూపంలో భూమిమీద తిరుగుతూ ఉంటాడు. నీవు మా గురు పుత్రుడవు. అందుచేత నాకు నీయందు నా భర్తల గురువు దర్శనమౌతున్నాడు. అటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నిన్ను నేను ఒక్కమాట అనను.’ ద్రౌపదీదేవి ఎంత ధర్మం పాటిస్తుందో మీరూ ఆలోచించండి. ఇదీ ద్రౌపది అంటే! ఆవిడ కోప్పడలేదు. ఎంత మాటన్నదో చూడండి!

’కోపంతో అశ్వత్థామను చంపేస్తామని నా పిల్లలు అస్త్ర శస్త్రములు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు. వారు యుద్ధభూమిలో లేరు. ఇంతకుపూర్వం వారు నీకు ద్రోహం చేయలేదు. అపారమైన నిద్రలో ఉన్న నాకుమారులు యుద్ధము చేయడమునందు ఆసక్తి లేనివారై గాఢనిద్రలో ఉన్నారు. ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు. ద్రోణాచార్యునికి కొడుకువు అయ్యావు. నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? నీవు పుత్రరూపంలో ఉన్న గురువు అని తలంచి నా అయిదుగురు కుమారులను నీవు చంపినప్పటికీ ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను’ అంది. ’రాత్రి చంపేటప్పుడు నీకీవిషయములు జ్ఞాపకం రాలేదా? అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణునకు తెలిసి వుండవలసిన ధర్మములు తెలియదా? అని అడిగినట్లు అవుతుందని “నీకు నా పిల్లలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయయ్యా?” అని అర్జునుని వంక చూసి అంది.

అర్జునా, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా! అయిదుగురు పిల్లలు సంహరింపబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేనిప్పటివరకూ ఏడ్చాను. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి రెండు చేతులతో అస్త్రములు ప్రయోగించగలిగిన నైపుణ్యం ఉన్నవాడివై గాండీవం పట్టుకొని రథము ఎక్కి పగబట్టి, అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడకు తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపి (ద్రోణుడి భార్య, అశ్వత్థామ తల్లి)కి వార్త అంది ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒక ఎత్తు. ఇంక చచ్చిపోతున్నాడు, ఇంక రక్షించుకోలేను అని ఏడవడం ఒక ఎత్తు. నీకు ఇన్ని అస్త్రములు నేర్పిన ద్రోణుని భార్య నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా? అశ్వత్థామా, మీ అమ్మ అక్కద ఎంతగా ఏడుస్తోందోనయ్యా! తలచుకుంటే నా మనస్సు వికలం అయిపోతోంది.” అని అర్జునుని పిలిచి, “ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతనిని సంహరించకూడదు. ఆయనను విడిచిపెట్టేయండీ. ఆయనకు కట్టిన బంధనములను విముక్తి చేయండి” అంది.

ఈమాట భీముడు విన్నాడు. ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. “ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు. ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకొని చంపేశాడు. నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను” అని అన్నాడు. భీముడికి ఆగ్రహం వస్తే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే.

అప్పుడు కృష్ణుడు అన్నాడు. “అర్జునా, నేను నీతో ఒక మాట చెప్తాను దానిని జాగ్రత్తగా విను. ఎవడు ఉపపాండవులను సంహరించాడో వాని తల కత్తిరించేస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు. వీనిని క్షమించవలసిన పనిలేదు. వీడు ఆతతాయి. కాబట్టి చంపి అవతల పడేయవచ్చు. కానీ ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెప్తోంది. ఇతడు ఆతతాయి కాబట్టి చంపివేయాలి. బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు ఏమి చేయాలో దానిని నీవు చేయవలసింది” అన్నాడు. ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలివేయాలి. అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చేసేయకూడదు. పూర్ణముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అశ్వత్థామ ఉపపాండవులను ధర్మం తప్పి చంపాడో అప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు. అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలే ఉంది. పుట్టుకచేత అశ్వత్థామకి శిరస్సుమీద ఒక మణి ఉంది. ఆ మణికాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు అర్జునుడు ఆ ధర్మమును పాటిస్తున్నాడు. అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు. అది సామాన్యమైన కత్తి కాదు. అది ఎంతమంది నెత్తురు త్రాగిందో. అటువంటి కత్తిని ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం క్షురక వృత్తిని వాడుతున్నాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతటినీ తీసి అవతల పారేశాడు. అతని తలలో ఉన్న మణిని ఊడబెరికి తను పుచ్చేసుకున్నాడు. అశ్వత్థామకు కట్టిన బంధనములను విప్పేసి ఒక్క త్రోపు తోసి అవతల పారేశాడు. ఆ త్రోపుతో అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు. హీనుడై, కాంతిపోయిన వాడై, తల వంచుకొని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమును చెప్పి సూతుడు అన్నాడు – శౌనకాది మహర్షులారా, వృత్తాంతమును విన్నారు కదా! ఇదీ కృష్ణలీల అంటే! ఇదీ కృష్ణుడు అంటే! ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునునకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. అందుకని భాగవతం.

ఈ ఉపపాండవుల పార్థివ శరీరమును తీసుకువెళ్ళారు. దహన క్రియలను ఆచరించి తదనంతరం వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. శోకిస్తూ ఇంకా ఉపపాండవులను తలచుకొని బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు. వ్యాసుడంటే భగవానుడే!

కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఃఖములను ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేస్తున్న కాలమునకు నీవు పరతంత్రుడవు. నీవు చేయగలిగినది ఏమీ ఉండదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు.