తదుపరి శంతనుడు సత్యవతీ దేవిని వివాహం చేసుకొని సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. సంతోషంగా కాలం గడుపుతుండగా మృత్యువు వచ్చింది. శంతన మహారాజు మరణించాడు. ఇద్దరి కొడుకులలో పెద్దవాడయిన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యమునకు వేటకు వెళ్ళాడు. అక్కడ ఆయన కర్మకొద్దీ చిత్రాంగదుడు అనే పేరు వున్న గంధర్వుడు కనబడ్డాడు. ‘నీవన్నాచిత్రాంగదుడు అనే పేరుతొ ఉండాలి. నేనయినా ఆ పేరుతొ ఉండాలి. నీవు ఆ పేరు వదులుతావా లేక నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేస్తే మనలో ఎవరు బతికితే వాడు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు. లేకపోతే పేరు మార్చుకుని వెళ్ళిపో’ అన్నాడు. ‘నేను పేరు మార్చుకోవడం ఏమిటి? మనం ఇద్దరం యుద్ధం చేద్దాం. ఎవరు బ్రతికి ఉంటే వాడే చిత్రాంగదుడు’ అన్నాడు. అపుడు చిత్రాంగదుడు, గంధర్వుడు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శంతన మహారాజుగారి కుమారుడయిన చిత్రాంగదుడు మరణించాడు. ఇంకా విచిత్రవీర్యుడు ఒక్కడే మిగిలాడు.

విచిత్రవీర్యుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపివేసేవాడు. ఇపుడు వంశం వర్ధిల్లాలి. ఇపుడు విచిత్రవీర్యునికి సరియైన భార్య దొరకాలి. ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషములతో తేలియాడుతుంటాడు. ఈయనకు తగిన భార్యను తేవలసిన బాధ్యత భీష్మునిమీద పడింది. ఆ వయస్సులో మహానుభావుడు భీష్మాచార్యుడు తాను చేసిన ప్రతిజ్ఞవల్ల ఎన్ని కష్టములను అనుభవించాడో చూడండి.

కాశీరాజుకు ‘అంబ’, ‘అంబిక’, అంబాలిక’ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. విచిత్రవీర్యుడు స్వయంవరమునకు వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు. అక్కడి వాళ్ళందరూ ఆయనను చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంలో ఉంటానని ప్రతిజ్ఞచేసిన భీష్ముడు స్వయంవరమునకు వచ్చాడని విస్మయం చెందారు. అందరూ చూస్తూండగా ‘నేను పౌరుషంతో ఈ రాజులనందరినీ ఓడించి ఈ అంబ, అంబిక, అంబాలికలను తీసుకు వెడుతున్నాను. ఎవరయినా నన్ను ఎదుర్కొనేవారు ఉంటే ఎదుర్కోవచ్చు’ అని ముగ్గురిని చేయిపట్టి రథం ఎక్కించి తీసుకు వెళ్ళిపోతున్నాడు. రాజులు అందరూ కలిసి భీష్ముని మీదకు యుద్ధానికి వచ్చారు. భీష్ముడు వారినందరినీ తుత్తునియలు చేసి ఆ ముగ్గురినీ హస్తినాపురమునకు తీసుకువచ్చాడు.

అపుడు అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి అంది – ‘మహానుభావా, నీకు తెలియని ధర్మం లేదు. నీకొక మాట చెపుతాను. నేను సాళ్వుడు అనే రాజును ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించాడు. ఆయన నాయందు పతీత్వ భావమును పొందాడు. కావున నేనిపుడు వేరొక పురుషునికి భార్యను కావడం అమర్యాద. అలా నేను కాకూడదు. అందుకని నన్ను తీసుకువెళ్ళి సాళ్వుడికి అప్పచెప్పవలసింది’ అంది. అపుడు భీష్ముడు – ‘మనసులేని స్త్రీ రాజునకు భార్యగా ఉండడానికి వీలుకాదు. అందుకని పరపురుషుని యందు అనురక్తి కలిగిన స్త్రీ భార్యగా ఇంట్లో ఉండడం త్రాచుపామును పెంచుకోవడం లాంటిది. అందుకని నువ్వు నా తమ్మునికి భార్యగా ఉండడానికి వీలులేదు. నిన్ను తీసుకువెళ్ళి సాళ్వుడికి అప్పజెప్పేస్తాను’ అని చెప్పి ఆమెను సాళ్వుడి రాజ్యమునకు రథంలో పంపించాడు. ఈమె సాళ్వుడి దగ్గరకు వెళ్ళి ‘నేను వచ్చేశాను, భీష్ముడు నన్ను నీవద్దకు పంపించి వేశాడు’ అని చెప్పింది. అపుడు ఆయన అన్నాడు – ‘అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చేయిపట్టి రథం ఎక్కించి తీసుకువెళ్ళాడో ఆనాడే నీవు భీష్ముడి సొత్తు అయిపోయావు. ఇపుడు చేతకానివాడిని భీష్ముడు పెట్టిన భిక్షను భార్యగా స్వీకరించడానికి నేను క్షత్రియుడను. రాజ్యపాలకుడను, మహారాజును. నేను నిన్ను ఒల్లను. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నీవు వాళ్ళకే సొత్తు’ అన్నాడు.

ఒక ఆడదాని బాధ చరిత్రను ఎలా మారుస్తుందో చూడండి. అందుకే స్త్రీల జోలికి వెళ్ళి నిష్కారణంగా వాళ్ళ మనస్సు ఖేదపడేటట్లు ప్రవర్తించకూడదు.

ఆవిడ బాధపడుతూ తపోవనమునకు చేరి ఋషులను సమీపించి ‘నేను తపస్సు చేసుకుంటాను – నాకు సన్యాసం ఇవ్వవలసింది’ అని కోరింది. అపుడు ఋషులు – ‘నీవు నిండు యౌవనంలో ఉన్నావు. నీవు వచ్చి ఇక్కడి ఆశ్రమంలో కూర్చుంటే ఇక్కడ వున్నవాళ్ళ తపస్సులు పాడయిపోయి లేనిపోని గొడవలు వస్తాయి. అందుకని నీవు ఇక్కడ ఉండడానికి వీలులేదు. ఈవేళ రాత్రికి ఉండు. రేపటి రోజున నీమార్గము నీవు చూసుకో. పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి? ఉంటే భర్త దగ్గర ఉండాలి. లేకపోతే తండ్రిగారి దగ్గర ఉండాలి. అందుకని నీవు నీ తండ్రిదగ్గరకు వెళ్ళవలసినది’ అన్నారు. ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళనన్నది.

ఆవిడ అదృష్టంకొద్దీ మరునాడు ఉదయం ఆవిడ తల్లిగారి తండ్రిగారు వచ్చారు. తాతగారికి తనగోడు వెళ్ళబోసుకుంది. ఆయన –‘నేను పరశురాముడికి అంతేవాసిని. పరశురాముడు భీష్ముడికి గురువు. అందుకని పరశురాముడితో భీష్ముడికి చెప్పిస్తాను’ అన్నారు. ఈలోగా ఒక పరిచారకుడు వచ్చి ‘అయ్యా పరశురాముల వారు వేంచేస్తున్నారు’ అన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి అంబ తనగోడు చెప్పుకుంది. పరశురాముని హృదయం కరిగిపోయింది. నేను నిన్ను తీసుకుని హస్తినాపురమునకు వెడతాను. భీష్ముడిని పిలిచి తను గెలుచున్న వాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెపుతాను’ అని ఆమెను రథం ఎక్కించి హస్తినాపురమునకు తీసుకువెళ్ళాడు.

హస్తినాపురం బయట విడిది చేసి భీష్ముడికి కబురుచేశాడు. వచ్చినవాడు గురువు కనుక భీష్ముడు ఒక ఆవును తీసుకొని వచ్చాడు. ఆవును దానం ఇచ్చి నమస్కారం చేసి ‘మహాప్రభో మీరు రావడమే అదృష్టం. రాజ్యంలోకి ప్రవేశించండి’ అన్నాడు. అపుడు ఆయన ‘నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు. నీవు ఓడించి తెచ్చిన కాంత అంబను భార్యగా స్వీకరించు’ అన్నారు. అపుడు భీష్ముడు ‘ఒకవేళ పంచతన్మాత్రలు తమతమ విధులను నిర్వర్తించడం మానివేస్తే మానివేయుగాక కానీ నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞనుండి మాత్రం వెనకడుగు వేసే సమస్యలేదు. అందుకని నేను మాత్రం ఈమెను భార్యగా స్వీకరించాను అన్నాడు. అపుడు పరశురాముడు ‘అయితే ఎవరికోసం తెచ్చావో ఆ తమ్ముడిని చేసుకోమను’ అన్నాడు. అపుడు విచిత్ర వీర్యుడిని అడిగాడు. ఆయన అన్నాడు ‘వేరొకరియందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయింది. తిరిగివస్తే నేను ఎలా పెళ్ళి చేసుకుంటాను? నాకు అక్కర్లేదు’ అన్నాడు. పరశురాముడికి ఆగ్రహం వచ్చింది. ఆయన భీష్ముని ‘నువ్వు అంబని వివాహం చేసుకుంటావా లేక నాతో యుద్ధం చేస్తావా’ అని అడిగాడు. అపుడు భీష్ముడు ‘ప్రతిజ్ఞాపాలనం కోసం ప్రాణములను విడిచి పెట్టేస్తాను. మీరు కురుక్షేత్రమునకు పండి. నేను అక్కడికి యుద్ధానికి వస్తాను’ అన్నాడు.

ఇద్దరూ కురుక్షేత్రం చేరుకున్నారు. అక్కడ బ్రహ్మాండమయిన యుద్ధం ఇరవై రెండు రోజులు జరిగి ఒకళ్ళని ఒకళ్ళు తుత్తినియలుగా కొట్టేసుకున్నారు. ఆఖరుకి ఒకరోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు పడుకుని ఉన్నారు. రోజూ భీష్ముడు పరశురాముడికి నమస్కారం పెట్టి ఆయనతో యుద్ధం చేసేవాడు. ఆయన తనకు గురువుగారు కదా! పరశురాముడిని నిగ్రహించడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అపుడు ఆయనకు అష్టవసువులు సాక్షాత్కరించారు. వారు ‘భీష్మా, నీవు బెంగపెట్టుకోకు. పరశురామునికి కూడా తెలియని అస్త్రం ఒకటి ఉంది. అది విశ్వకర్మ మంత్రంతో ఉంది అది నీ ఒక్కడికే తెలుసు. రేపటిరోజున దానిని ప్రయోగించి. ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్రపోతాడు. యుద్ధభూమిలో నిద్రపోయిన వాడు మరణించిన వానితో సమానం. మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేడు కాబట్టి పరశురాముడు మరణించినట్లే. కాబట్టి ఆ అస్త్రమును ప్రయోగించు’ అన్నారు. ‘తప్పకుండా ప్రయోగిస్తాను’ అని లేచి ఆచమనం చేసి యుద్ధమునకు వచ్చాడు. పరశురాముడి మీద ఆ అస్త్రమును ప్రయోగిద్దామని బాణమును సంధించి మంత్రం పలుకుతున్నాడు. అపుడు ఆయనకు నారదాది మహర్షులు అందరూ దర్శనం ఇచ్చారు. వారు ‘భీష్మా, నువ్వు చాలా ఘోరమయిన పాపం చేస్తున్నావు. ఇది నీవంటి ధర్మజ్ఞుడు చేయవలసిన పనికాదు. నీవు ఆ అస్త్రమును ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వానితో సమానమయిపోతాడు. అంతటి అపకారం అంతటి అవమానం గురువుపట్ల చేయకూడదు. కాబట్టి నీవు ఆ అస్త్ర ప్రయోగం చెయ్యకు’ అన్నారు. అపుడు భీష్ముడు గురువును అవమానించాను’ అని ఆ అస్త్రమును ఉపసంహారం చేసేశాడు.

అదే సమయంలో పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మొదలైన వాళ్ళు వచ్చారు. పరశురామునితో వాళ్ళు ‘నువ్వు బ్రాహ్మణుడివై నీ శిష్యుని మీద అంత బాణప్రయోగం చేయకూడదు. భీష్ముడు ధర్మమునకు కట్టుబడ్డాడు. నువ్వు ఉపశాంతి వహించవలసినది’ అని చెప్పారు. పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ళ మీద దొర్లి రథంలోంచి క్రిందపడిపోయాడు. అందుకని భీష్ముని చేతిలో ఓటమినంగీకరించాడు. ‘నేను ఓడిపోయినట్లే లెక్క, అంబా, ఇంకా నిన్ను నేను రక్షించలేను. నువ్వు నీకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. నీకు ఎవరివలన వివాహం అవుతుంది అనుకుంటే వారిని ఆశ్రయించు’ అన్నాడు. ఆవిడ ‘ఇపుడు నాకొక విషయం అర్థమయింది. పరశురాముడు గతంలో ఇరవై ఒక్క మారులు భూమండలము చుట్టూ తిరిగి క్షత్రియుడన్న వారినందరినీ తెగటార్చాడు. అటువంటి పరశురాముని భీష్ముడు ఓడించేశాడు. కాబట్టి భీష్ముని ఓడించేవాడు లేదు. కాబట్టి నాపెళ్ళి అవదు. కాబట్టి నేను ఒక ప్రతీకారం తీర్చుకుంటాను. భీష్ముడిని చంపుతాను’ అని ప్రతిజ్ఞచేసింది. ‘ఇంకా నాకు వివాహం అక్కరలేదు. భీష్ముడు ఎలా చనిపోతాడు. ఇది ఒక్కటే నాకోరిక’ అని ఆవిడ తపస్సు చేయడం మొదలుపెట్టింది