అన్నింటికంటే ఇంద్రియములను గెలవడం చాలా కష్టం. ఇంద్రియములను తొక్కిపట్టి ఉంచితే అవి వాటికి అవకాశం వచ్చినప్పుడు కాటువేసి మనిషిని పతనం చేస్తాయి. ఈవిధంగా అజామీళుడు చిట్టచివరకు దొంగ అయ్యాడు. ఆటను గ్రహించుకోలేనిది ఒకటి ఉంది. దాని పేరు కాలము. అటువంటి కాలము ఎవ్వరి గురించి ఆగదు. ఎప్పుడో ఒకరోజు మహా మరణ కాలము వస్తుంది. ఆ మృత్యువు కబళించక ముందే ఈశ్వరనామం చెప్పుకోవాలి. అజామీళుడు భోగములు, సుఖములు శాశ్వతం అనుకున్నాడు. కానీ అతనిని తీసుకువెళ్ళి పోయే సమయం వచ్చేసింది. భటులు భయంకరమయిన రౌద్ర రూపములతో వచ్చారు. బంధువులు అంతా వచ్చి ఏడుపులు మొదలుపెడతారు. అప్పుడు నిన్ను రక్షించేది ఏదయినా ఉన్నది అంటే అది నీవు చేసుకున్న సాధన ఒక్కటే! అప్పడు స్వామి నామమును ఉచ్ఛరించగలగాలి. నీశరీరమును విడిచి పెట్టేటప్పుడు మురికిలో పడిన ఉత్తరీయము తీసి విసిరి పారేసినట్లు శరీరమును వదిలి ఈశ్వర పాదములయందు ప్రవేశించ గల ధృతిని పెంచుకో” అంటారు శంకరాచార్యుల వారు. అందుకు సాధన అవసరం. యమదూతలు వచ్చి అజామీళుడి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళను చూసేసరికి ఈయనకు విపరీతమైన భయం వేసింది. అంత భయంలో ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నంగా నారాయణా! అని తన కొడుకును తలచుకుంటూ గొణిగాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇంతవరకు ఎంత భయమును పొందాడో ఆ భయమును మాయం చేయగలిగిన విచిత్ర విషయమును చూశాడు.

నలుగురు దివ్య తేజోవంతులయిన మహాపురుషులు వచ్చి యమధర్మరాజు భటులతో ఆ పాశములను తీసివేయమని చెప్పారు. అపుడు యమధర్మరాజు భటులు ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నించారు. ‘మేము ఎవరిమో చెప్తాము. ముందు ఆ పాశములను తీసివెయ్యండి’ అన్నారు. అపుడు యమదూతలు తమ పాశములను విడిపించారు. అజామీళుడికి పూర్వపు ఓపిక వచ్చింది. వాళ్ళ మాటలు బయట వాళ్ళకు వినబడడం లేదు. కానీ అజామీళుడు మాత్రం వాళ్ళ మాటలను వింటున్నాడు. ఆవచ్చిన వాళ్ళు ఎవరా? అని అజామీళుడు విష్ణుదూతల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. యమదూతలు “అయ్యా వీడెవడో తెలుసా! పరమ దుర్మార్గుడు. ఇటువంటి వాడిని మేము ఎందుకు విడిచిపెట్టాలి? మీరు వేడిని ఎందుకు వదలమంటున్నారు? మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు ఎవరు? అని అడిగాడు.

అపుడు విష్ణు దూతలు “మమ్ములను విష్ణు పార్షదులు అంటారు. మేము శ్రీవైకుంఠము నుండి వచ్చాము. అజామీళుడిని విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు. అందుకని వచ్చాము’ అన్నారు.

అపుడు యమభటులు ‘ఇది ధర్మమా? ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతాము?’ అని అడిగారు. అపుడు విష్ణుదూతలు ‘ ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరుగా గలిగిన యమధర్మరాజు గారిని అడగండి. మీరు యితడు ఈ జన్మలో చేసిన పాపముల గురించి మాట్లాడుతున్నారు. మేము ఇతని కోటిజన్మల పాపముల గురించి మాట్లాడుతున్నాము. అంత్యమునందు శరీరమునందు ప్రాణోత్క్రమణం జరుగుతున్న సమయంలో యితడు ఈశ్వరుని నామమును పలికాడు. అది అమృత భాండము. శ్రీహరి నామమును పలికిన కారణం చేత కోటిజన్మల పాపరాషి ధ్వంసము అయిపొయింది. కాబట్టి ఈతనిని మీరు తీసుకుని వెళ్ళడానికి అర్హత లేదు’ అన్నారు. అపుడు యమదూతలు ‘అయితే వీడు చేసిన పాపములు అన్నీ ఏమయ్యాయి?” అని అడిగారు. అపుడు విష్ణుదూతలు నీవు మాతో రావచ్చు అని అజామీళుడిని వైకుంఠమునకు తీసుకు వెళ్ళిపోయారు. ఆయన శ్రీమన్నారాయణునిలో ఐక్యం అయిపోయాడు. భాగవతుల తోడి అనుబంధమే మనలను రక్షిస్తుంది.

వెనుదిరిగి వెళ్ళిపోయిన యమదూతలు యమధర్మరాజుగారి వద్దకు వెళ్ళి “మాకో అనుమానం. ఇన్నాళ్ళ నుండి నీవు తీసుకురమ్మన్న వాళ్ళను మేము వెళ్ళి తీసుకు వచ్చేవాళ్ళం. కానీ ఈవేళ మేము వెళ్లేసరికి అక్కడికి నలుగురు వచ్చి అజామీళుడిని వదిలిపెట్టమన్నారు. తెలిసో తెలియకో భగవంతుని నామం చెప్పడం వలన అతని పాపములు పోయాయి అంటున్నారు. పాపములు అలా నశించి పోతాయా? మా సందేహములను నివృత్తి చేయవలసింది” అని కోరారు. అపుడు యమధర్మరాజు తన భటులను అందరినీ పిలిపించి ఒక సమావేశామును ఏర్పాటు చేసి “జీవులు తమ జీవితములయందు అనేక పాప కర్మలను చేసి ఉంటారు. చేసిన పాపం నశించడం మాట ఎలా వున్నా చేసిన పాపము చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. దానికి ప్రాయశ్చిత్తకర్మ అంటారు. ప్రాయశ్చిత్తము చేత వారు చేసిన పాపముల వ్యగ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కర్మను భక్తివైపుకి తిప్పుకోవాలి. భక్తికి బదులు వెర్రి అనుమానములు ప్రారంభమయిపోకూడదు. కలలో ఇందిరా రమణుని పాదములు కనపడని వాడు ఎవడయినా వుంటే వాడిని మీరు తీసుకువచ్చేయవచ్చు. అర్హతను మరచి పెద్దలు వ్రాసిన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని, యాత్రలకు వెళ్ళి గుడిని సమీపించి గుడిలోని దేవుని దర్శించని వాళ్ళను, దేవుని ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవం చూడడానికి అడుగుతీసి అడుగు పెట్టని దుర్మార్గామయిన పాదములు ఉన్నవారిని, మహాభాగవతులయిన వారి పదముల అడుగున వున్న ధూళి కణములను ఆశ్రయించి సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నిలబడడమేమిటని ధ్వజ స్తంభాములా నిలబడిపోయిన దౌర్భాగ్యులను తీసుకు వచ్చేయండి. ఇప్పుడు నే చెప్పిన వారినే కాదు. ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ పుడుతున్నారో వారికి సంబంధించిన వారిని నాలుగు తరముల వరకు ఏరి అవతల పారెయ్యండి. అలాంటి వారి దగ్గరకు చేరి దిక్కుమాలిన మాటలు మాట్లాడేవారిని కూడా లాగి అవతల పారవేయవచ్చు.

నా స్వామి చరణములు నాకు చాలు అని స్వామి పాదములను గట్టిగా పట్టుకొనిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదములు పట్టుకుంటున్నారో కష్టంలో సుఖంలో ఆయన పేరు చెబుతుంటారో అటువంటి వారిని, ఈశ్వరుని నామం చెప్పిన వారిని, వారికి సంబంధించిన నాలుగు తరముల వాళ్ళని, వారితో కలిసివుండే వాళ్ళని తొందరపడి తీసుకురావద్దు. బాగా పరిశీలించండి. సాధ్యమైనంత తేలికగా విడిపించండి. ఈలోగా అక్కడికి విష్ణుదూతలు కనుక వచ్చినట్లయితే మీరు వచ్చేయండి. వాళ్ళ జోలికి వెళ్ళవద్దు’ అని తీర్పు చెప్పాడు. దీనిని బట్టి మనకు అన్నిటికన్నా ఈశ్వరనామము గొప్పది అని తెలుస్తోంది. అందుకని మీరు నామమును పట్టుకోవడం ముందు నేర్చుకోవాలి. అటువంటి విశిష్టమయిన విషయమును చెప్పినది ఈ ఆఖ్యానము. ‘నిరంతరమూ నా నాలుకమీద ఈశ్వరనామము నర్తన చేయగలిగిన అదృష్టమును ఈశ్వరా నిర్హేతుకముగా కటాక్షించు’ అన్నారు రామదాసు గారు. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరరక్షమాం!! అని మార్కండేయుడు ఈశ్వరనామమును చెపుతుంటే స్వామి యమధర్మరాజు గారిని తన్నాడు.

వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం

భూభృత్ పర్యటనం నమత్సుర-శిరః కోటీర సంఘర్షణమ్

కర్మేదం మృదులస్య తావక-పద ద్వంద్వస్య గౌరీ-పతే

మచ్చేతో మణి-పాదుకా విహరణం శంభో సదాంగీ-కురు!!

అంటూ శంకర భగవత్పాదులు శివానందలహరిలో పొంగిపోతారు. అటువంటి వైభవము కలిగిన నామము ఏది ఉన్నదో ఆ నామము వ్యాసభగవానుడి అనుగ్రహంగా, పోతనామాత్యుల అనుగ్రహంగా, మన గురువుల అనుగ్రహంగా, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా, నిరంతరమూ మన నాలుకయందు నర్తించు భాగ్యము మనకు కలుగుగాక యని ఈశ్వరుడు మనలను కటాక్షించుగాక!

ఈ అజామిళోపాఖ్యానం ఎవరు చదివారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్లకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసమహర్షి అభయం ఇచ్చారు. అదీ దాని ఫలశ్రుతి!