అమరావతిని స్వాధీనం చేసుకొని ఇంద్రుడు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ పూర్వం ‘మా ఐశ్వర్యం అంతా మీది’ అని ఒక మాట అన్నాడు కదా! ‘మహానుభావా, మీ వలననే మరల నేను ఈ అమరావతిని పొందాను. ఈ ఐశ్వర్యం అంతా మీదే. మీరు ఈ ఐశ్వర్యమును అనుభవించవచ్చు’ అన్నాడు. తనవలన శిష్యుడు అంట ఐశ్వర్యమును పొందాడని, వాని ఐశ్వర్యమును పొందే ప్రయత్నమును గురువు చెయ్యడు. విశ్వరూపుడు అన్నాడు ‘ నీ ఐశ్వర్యం నాకెందుకు? నేను అలా పుచ్చుకునే వాడిని కాను. నీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు’ అన్నాడు. ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులను స్వీకరిస్తూ ఉండేవాడు. ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తూ ఉండేవాడు. కానీ ఆయన తల్లిగారి పేరు ‘రచన’. ఆవిడ రాక్షస వంశమునకు చెందినది. మేనమామలైన రాక్షసులు వచ్చి ‘ఒరేయ్, నువ్వు మా మేనల్లుడివి. నీవల్ల మేము స్వర్గమును పోగొట్టుకున్నాము. నీవు వెళ్ళి దేవతలకు గురుత్వము వహించావు. ఇంద్రుడికి నీమీద నమ్మకం ఎక్కువ. కాబట్టి ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా హవిర్భాగములు పెట్టేస్తూ ఉండు’ అన్నారు.

ఇలా చేయడం తప్పే అందులో సందేహం లేదు. అయితే విశ్వరూపుడు పెట్టాడు. అయితే ఎందుకు పెట్టాడు? విశ్వరూపుడు తన స్వరూపం ఏమిటో ముందరే చెప్పాడు. ‘నాకు రాగద్వేషములు తెలియవు. నేను అంతటా బ్రహ్మమునే చూస్తాను. ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కున వారిమాట వినేస్తాను’ అని చెప్పాడు. అందుకని వాళ్లకి హవిర్భాగములు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇది ఒకరోజున ఇంద్రుడు గమనించాడు. మరుక్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. వెంటనే తన చేతిలో వున్న చంద్రహాసమును తీసుకొని మహానుభావుడైన విశ్వరూపుని మూడు తలకాయలు తెగిపోయేటట్లు నరికేశాడు. ఆయన మూడు తలకాయలలో ఒక తలకాయతో యజ్ఞవేదిలో సురాపానం చేస్తూ ఉంటాడు. సురాపానం చేసే తల క్రింద పడగానే అది ఆడ పిచ్చుకగా మారిపోయింది. సోమపానం చేసే తలకాయ కౌజు పిట్టగా మారిపోయింది. అన్నం తినే తలకాయ తీతువు పిట్టగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ తీతువు పిట్ట అరిచింది అంటే అమంగళము అని అంటారు. ఎందుకు అంటే ఆనాడు ఇంద్రుని వలన బ్రహ్మహత్య జరిగింది. ఎవరిని గురువుగా పెట్టుకున్నాడో అటువంటి గురువు తలకాయ కోసేశాడు. అలా కోసేసినపుడు పడిపోయిన తలకాయే తీతువు పిట్ట అయింది. అటువంటి కూత వినపడితే అమంగళము. అది ఒక్క కృష్ణ స్మరణం చేత మాత్రమే పోతుంది. అందుకే తీతువు పిట్ట అరిచినపుడు కృష్ణ స్మరణ చేస్తూ ఉంటారు.

ఈవిధంగా తెగిపడిన విశ్వరూపుని మూడు తలలు మూడు పిట్టలయ్యాయి. ఈ మూడు పిట్టలు కూస్తూ ఇంద్రుని వెంట పడ్డాయి. ఆ ఘోరమయిన కూతలను వినలేక ఏడాదిపాటు భరించాడు. బ్రహ్మ హత్యాపాతకం వలన అతనికి మనశ్శాంతి పోయింది. దీనిని ఎవరికయినా ఇచ్చివేయాలి. ఎవరు పుచ్చుకుంటారు? ఆ రోజులలో ఇంద్రుని మాట కాదనలేక బ్రహ్మ హత్యాపాతకమును పుచుకోవడానికి నలుగురు ఒప్పుకున్నారు. అవి భూమి, చెట్లు, జలము, స్త్రీలు. ఈ నలుగురు పావు వంతు చొప్పున పుచ్చుకున్నారు. తీసుకొనినందుకు గాను తమకు వరముల నిమ్మని ఇంద్రుని అడిగారు. అపుడు ఇంద్రుడు వాటికి వరములు ఇచ్చాడు. భూమికి ‘ఎవరయినా గొయ్యి తీసినా ఆ గొయ్యి కొంత కాలమునకు తనంత తాను పూడుకుపోతుంది’ అని, చెట్లకు ‘ఎవరయినా చెట్లను కత్తితో నరికేసినా మొదలు ఉంటే చాలు మరల చిగురించేలా’, ‘ఏ పనిచేసినా ప్రక్షాళనము అనబడే మాట దానియందు ప్రయోగింప బడదు. మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువును ముట్టుకుని ఒక కాగితమునకు తుడుచు కున్నారనుకోండి అది ప్రక్షాళనము అనరు. నీటి చుక్క ముట్టుకున్నట్లయితే వెంటనే ప్రక్షాళనము అయిపోతుంది. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోని పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేస్తే ఒక చుక్క నీరు చేతిలో వేస్తే చెయ్యి తుడుచుకుంటాము. ఒక్క చుక్కయినా చాలు. అటువంటి ప్రక్షాళన చేయగలిగే శక్తి నీటికి ఇచ్చాడు. కామోప భోగములందు ఎక్కువ సుఖము కలిగేటట్లు స్త్రీలకి వరం ఇచ్చాడు. ఈవిధంగా నలుగురుకి నాలుగు వరములు ఇచ్చాడు.

ముందు భూమి పుచ్చుకుంది. ఊసర క్షేత్రములు వచ్చాయి. అంటే ఉప్పుతో కూడిన పంటలు పండని ఇసుక పర్రలు ఏర్పడ్డాయి. దానిమీద మొక్క మొలవదు. చెట్టు పుచ్చుకుంది. చెట్టులోంచి జిగురు కారుతుంది. అందుకే చెట్టు జిగురు వికారమును స్పృశించకూడదు అంటారు. నీటియందు బుడగగాని, నురుగు కాని ఉంటే అది బ్రహ్మహత్యా పాతక రూపం. ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగగాని, నీటియందు నురుగు కాని ఉంటే ఆ నీళ్ళని పక్కకి వదిలి పెట్టేస్తారు. కొత్తగా ప్రవాహం వచ్చేముందు పెద్ద పెద్ద నురుగు వస్తుంది. దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ, ఆ నరుగు ముట్టుకోవడం కానీ చెయ్యరు. స్త్రీలయందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యా పాతక రూపం. వారియందు ఆ నియమం ఉంచారు. ఇంద్రుడు తన బ్రహ్మ హత్యాపాతకము నుండి నివారణ పొంది మరల సింహాసనాదిష్టుడు అయ్యాడు. ఒకనాడు బృహస్పతి సభలోకి వచ్చినపుడు లేవనందుకు సంభవించిన పాపం ఇప్పటికీ తను సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీల్లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని వెనుక మరొకటి తీసుకు వచ్చేస్తోందో చూడండి!

విశ్వరూపుడు మరణించాడు అని త్వష్ట ప్రజాపతికి తెలిసి కోపముతో ఒక పెద్ద యజ్ఞం మొదలు పెట్టాడు. ఇంద్రుడిని సంహరించే వేరొక కొడుకు ఆ యజ్ఞంలోంచి రావాలని అన్నాడు. యజ్ఞం పరిసమాప్తము అవుతుండగా ఒక బ్రహ్మాండమయిన రూపము ఆ యజ్ఞ గుండంలోంచి బయటకు వచ్చింది. ఆ యజ్ఞ గుండంలోంచి బయటకు వచ్చిన రూపమునకు పేరు తండ్రిగారు పెట్టలేదు.అది పుట్టీ పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండము ఎంతవరకు ఉన్నదో అంతవరకూ వ్యాపించేసి నిండిపోయింది. ఇంకా చోటు లేదు. అంత నిండిపోయింది కాబట్టి దానికి ‘వృతాసురుడు’ అని పిలిచారు. ఆయన తలకాయను నరకడానికి ఇంద్రునికి ఒక ఏడాదికాలం పట్టింది. వజ్రాయుధంతో ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఒక ఏడాదిపాటు నరికాడు. కోస్తే ఉత్తరాయణ, దక్షిణాయన మధ్య కాలానికి కోయడం పూర్తయింది. అతడు పుడుతూనే ఆకాశం అంతటిని నోట్లో పెట్టుకుని చప్పరించాడు. ఆ తరువాత అది ఏమయినా రుచిగా ఉంటుందేమోనని ఒక్కొక్క గ్రహమును నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. అలా గ్రహములను, నక్షత్రములను, బ్రహ్మాండములను, అన్నింటినీ చేత్తో పట్టుకుని వాటిని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. వాడు పుడుతూనే ‘ఇంద్రుడు అనేవాడు ఉండాలి. ఎక్కడ ఉంటాడు’ అని అడిగాడు. అంటే వాడు తనని చంపడానికి వచ్చేస్తున్నాడని ఇంద్రుడికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇంద్రుడు సైన్యం అంతటినీ తీసుకుని యుద్ధమునకు వెళ్ళాడు. వీరు వేసిన అస్త్రములను తన గుప్పెటతో పట్టుకుని నోట్లో వేసుకుని చప్పరించేశాడు. ఇంకా వానితో యుద్ధం లాభం లేదని, ముందు బతికితే చాలనుకుని దేవతలందరూ పారిపోవడానికి నిశ్చయించుకున్నారు. శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠ ద్వారం వద్దకు వెళ్ళి నిలబడి శ్రీమన్నారాయణుని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆయనకు ఆర్తత్రాణ పరాయణుడు అని బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పుచేశాడా, ఒప్పు చేశాడా అని చూడడు. గభాలున వచ్చి దర్శనం ఇచ్చి రక్షిస్తారు. తనను నమ్మినవారి పట్ల అలా ప్రవర్తిస్తారు. స్వామి దర్శనం ఇచ్చి ‘మీరేమీ బెంగ పెట్టుకోకండి. భయపడకండి’ అని అభయ ప్రకటన చేశారు. అపుడు వీరందరూ స్వామిని స్తోత్రం చేశారు.

వెంటనే స్వామి పోనీలెండి మీరేమీ బెంగ పెట్టుకోకండి వృతాసురుణ్ణి సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అనలేదు. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది. అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చులకన భావం ఉంది. మనం పలుమార్లు వాళ్ళను తెచ్చుకోవచ్చు. ఎలాగయినా వాడుకోవచ్చు అనే భావన ఒకటి మనసులో మెదలుతోంది. ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలి అనుకుని ‘మిమ్మల్ని రక్షించడానికి మీకు అస్త్ర శస్త్రములు పోయాయి కదా! వృతాసురుణ్ణి సంహరించడానికి కావలసిన ఆయుధమును ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే దధీచి మహర్షి. మీకు వలయు ఆయుధం ఆయన శరీరం నుండి వస్తుంది. ఆయన నిరంతరం నారాయణ కవచమును పారాయణం చేశాడు. అందుకని ఆయన వద్దకు వెళ్ళి ‘అయ్యా, మీ శరీరం ఇచ్చేయండి’ అని అడగండి. ఆయన బ్రహ్మజ్ఞాని. తన శరీరమును ఇచ్చేస్తాడు. ఆయన శరీరం ఇచ్చిన తరువాత ఆయన శరీరమును కోసివేయండి. లోపల ఉన్న ఎముకలను పైకితీసి మూట కట్టుకుని పట్టుకు వెళ్ళి విశ్వకర్మకు ఇవ్వండి విశ్వకర్మ ఆ ఎముకలలోంచి నూరు అంచులు కలిగిన వజ్రాయుధమును తయారుచేస్తాడు. దానితో వృతాసురుడు సంహరింప బడతాడు. అందుకని వెళ్ళి దధీచిని ప్రార్థించండి అని చెప్పాడు. గతంలో త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని సంహరించడం వల్ల తనకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఇపుడు వృత్రాసురుని సంహరించడం వలన మరలతనకు ఏమి కీడు మూడుతుందో నాన్న ఆలోచన ఇంద్రునికి కలిగింది. ఈవిషయమునే దేవతలకు చెప్పాడు. ఇపుడు ఇంద్రునిలో కొంచెం పాప పుణ్యముల విచారణ ప్రారంభం అయింది. అపుడు దేవతలు ‘మేము నీచేత అశ్వమేధ యాగమును చేయించి ఎలాగోలాగ నీవు బ్రహ్మ హత్యాపాతకం నుండి విముక్తుడవయెలా చూస్తాము. ముందు వెళ్ళి ఆ దధీచి శరీరమును అడగవలసినది’ అని చెప్పారు. ఇప్పుడు పరుగెత్తుకుంటూ దేవతలను తీసుకుని దధీచి దగ్గరకు వెళ్ళాడు.