వృత్రాసుర సంహారం చేయడం వలన మరల బ్రహ్మ హత్యాపాతకం అంటుకుంటుంది. క్రిందటి సారి ఆ బ్రహ్మహత్యా పాతకమును నలుగురికి పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ హత్యా పాతకం పరమ వృద్దుడయిన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో, ఒళ్ళంతా క్షయ వ్యాధి, కుష్ఠు వ్యాధి చేత పుండ్లు పడిపోయి నోటివెంట నవరంధ్రముల వెంట పుల్లటి కంపు కొడుతుండగా ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణములతో ఇంద్రుని కౌగలించుకోవడానికని వెంటపడింది. అది బ్రహ్మహత్యాపాతక స్వరూపం. అది బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగుపరుగున అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఎటువైపుకు వెళ్ళినా విడిచి పెట్టలేదు. అప్పుడు ఇంక దారిలేక ఇంద్రుడు ఈశాన్య దిక్కుపట్టి పరుగెత్తి మానససరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. అక్కడికి బ్రహ్మహత్యా పాతకం కూడా తరిమి రాలేక పోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురుచూస్తూ నిలబడింది. ఇంద్రుడు మానస సరోవరంలోకి దూకి అందులో ఉన్న ఒక తామరపువ్వు గుండా తామర నాళం లోనికి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరిపోయాడు. అక్కడ ఇంద్రుడు వేయి సంవత్సరములు ఉన్నాడు. ఒడ్డున ఆ బ్రహ్మహత్యా పాతకం బయటకు రాకపోతాడా పట్టుకోనక పోతానా అని నిరీక్షిస్తూనే ఉంది. అలా ఇంద్రుడు నారాయణ కవచమును శ్రీమన్నారాయణుని తపమును ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు. ఈశ్వరారాధనం చేస్తూ కూర్చున్నాడు.

ఈ వెయ్యి సంవత్సరములు గడిచేలోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఇంద్రపదవి ఖాళీగా ఉంది. ఆ పదవిలోకి తాత్కాలికముగా అనేక యాగములు చేసిన నహుషుడు అనే మహారాజును తెచ్చి కూర్చోబెట్టారు. ఇంద్రపదవిలో కూర్చోగానే ఆయనకో వెర్రి పుట్టింది. ‘ఇంద్రపదవి ఒకటీ ఇచ్చి వదిలిపెడితే ఎలా – శచీదేవి కూడా నాది కావాలి కదా’ అన్నాడు. ‘ప్రస్తుతం నేనే ఇంద్రుడిని కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నీవు నా భార్యగా ఉండు’ అని శచీదేవికి వర్తమానం పంపడం మొదలుపెట్టాడు. ఆయన ప్రవర్తన నచ్చక శచీదేవికి ఏమి చేయాలో అర్థం కాలేదు. లలితా సహస్రంలో అమ్మవారికి ‘పులోమజార్చిత’ అని పేరు ఉంది. పులోముడు శచీదేవి తండ్రి. పులోముని కుమార్తె అయిన శచీదేవి చేత నిరంతరం లలితా పరాభట్టారిక అర్చింపబడుతు ఉంటుంది. భార్య చేసే పూజ వలన భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. అందుకని ఆయన ఇంద్రపదవి యందు ఉన్నాడు. ఈమె యందు ఏ దోషము లేదు కాబట్టి బృహస్పతి ఈమెకు దర్శనం ఇచ్చి ‘అమ్మా!దీనికి ఒకటే పరిష్కారం. నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో ఇలాగ వీనితోను ఒక అపచారం చేయించు. కాబట్టి నహుషుడిని ‘సప్తర్షులు మోస్తున్న పల్లకిలో రా – నీవు నాకు భర్తవు అవుదువు గాని’ అని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి అయ్యా, ఈ పని చేయనా అని ఉండదు. ‘సప్తర్షులను పిలిచి మోయమని పల్లకి ఎక్కుతాడు అని చెప్పాడు. బృహస్పతి తెలివితేటలు వట్టినే పోతాయా! ఆవిధంగా నహుషుడు సప్తర్షులు మోస్తున్న పల్లకి ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో అగస్త్య మహర్షి ఉన్నారు.

ఆయన మహాశక్తి సంపన్నుడు. పొట్టిగా ఉంటాడు. ఆయన అడుగులు గబగబా పాడడం లేదు. నహుషుడు లోపలినుంచి చూశాడు. తొందరగా శచీదేవి వద్దకు వెళ్ళాలనే తాపత్రయంతో ‘సర్పసర్ప’ ‘నడు నడు’ అని ఆయనను హుంకరించి డొక్కలో తోశాడు. అగస్త్యునికి కోపం వచ్చింది. పైకి చూసి ‘చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని అడుగులు వేయలేక పోతున్న వాడిని అయిన నన్ను ‘సర్ప సర్ప’ అన్నావు కాబట్టి నీవు సర్పమై కొండచిలువవై భూలోకంలో పడిపో’ అని శపించాడు.వెంటనే నహుషుడు కొండచిలువయి క్రిందపడ్డాడు. ఇపుడు మరల ఇంద్రపదవి ఖాళీ అయింది కదా! మరల ఇంద్రుని తీసుకురావాలి. అపుడు దేవతలు, ఋషులు అందరూ కలిసి మానస సరోవరం దగ్గరకు వెళ్ళారు. వెయ్యి సంవత్సరాలు తపించిన ఇంద్రుని శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. పూర్తి నివారణ కాలేదు. అప్పుడు ఇంద్రుని తీసుకు వచ్చి అశ్వమేధ యాగం చేయించారు. చేయిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాపపరిహారం చేశారు. ఏది చేసినా భగవానుడే చేయాలి. అందుచేత ఇంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహమునకు నోచుకున్నాడు. బ్రహ్మహత్యా పాతకము నివారణయై మరల వచ్చి ఇంద్రపదవిలో కూర్చుని సంతోషముగా గురు వును సేవిస్తూ కాలమును గడుపుతున్నాడు.

ఇంద్రపదవిని అలంకరించిన వాడే గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కష్టములు పడ్డాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ గురువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గురువులు మీ డబ్బు కోరుకునేవారు కారు. మీ ఐశ్వర్యమును కోరుకునే వారు కాదు. వారిపట్ల ఎప్పుడూ మర్యాద తప్పకూడదు. ఎప్పుడూ వారిపట్ల మర్యాదతో ప్రవర్తించడం, వారు చెప్పిన మాట వినడం అనే మంచి లక్షణమును కలిగి ఉండాలి. దాని చేత మీరు ఉద్ధరింపబడతారు.

సప్తమ స్కంధము – ప్రహ్లాదోపాఖ్యానం:

ప్రహ్లాదోపాఖ్యానం పరమపవిత్రమయిన ఆఖ్యానం. అందులో ఎన్నో రహస్యములు ఉన్నాయి. వైకుంఠ ద్వారపాలకులయిన జయవిజయులు ఇద్దరు సనక సనందనాడుల పట్ల చేసిన అపచారం వలన శాపవాశం చేత భూలోకమునందు అసురయోనిలో జన్మించి రాక్షసులాయి మూడు జన్మలు ఎత్తిన తరువాత మరల శ్రీమన్నారాయణుడు వారిని తన ద్వారపాలకుల పదవిలోనికి తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు. వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు.

హిరణ్యకశిపుడు అంటే కనబడ్డదల్లా తనదిగా అనుభవించాలని అనుకునే బుద్ధి కలవాడు. ఆయనకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అను నలుగురు కుమారులు కలిగారు. ప్రహ్లాదునికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు సింహిక. సింహిక కుమారుడు రాహువు. ఆ రాహువే ఇప్పటికీ మనకి పాపగ్రహం క్రింద సూర్య గ్రహణం చంద్ర గ్రహణంలో కనపడుతూ ఉంటాడు. ఆయనే మేరువుకి అప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాడు. హిరణ్యాక్షుడు మరణించిన సందర్భముతో ఈ ఆఖ్యానమును ప్రారంభం చేస్తున్నారు. ఆయన భార్యలు, తల్లిగారయిన దితి హిరణ్యాక్షుడు మరణించాడని విలపిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి హిరణ్యకశిపుడు వచ్చాడు. అపుడు హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతమును చూస్తే అసలు ఇతను రాక్షసుడేనా, ఇలా వేదాంతమును ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది.

హిరణ్యకశిపుడు ఏడుస్తున్న భార్యలను, తల్లి చూసి “సాక్షాత్ శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. ఉత్తమలోకాల వైపుకి వెళ్ళిపోయాడు. అటువంటి వాని గురించి ఎవరయినా ఏడుస్తారా? ఏడవకూడదు అని ఒక చిత్రమయిన విషయం చెప్పాడు.

పూర్వకాలంలో సుయజ్ఞుడు చాలాకాలం ప్రజలను పరిపాలన చేసి అనేకమంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు. అతని భార్యలు, పుత్రులు అందరూ విలపిస్తున్నారు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అపడు ఆయన ఒక బ్రాహ్మణ కుమారుని వేషంలో అక్కడికి వచ్చి ఒకమాట చెప్పాడు “ఏమయ్యా, మీరందరూ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చావు తప్పించుకొని దాక్కున్న వాడెవడూ లేదు. కొన్నాళ్ళు బ్రతికిన తరువాత వెళ్ళిపోవడం అన్నది ఈ ప్రపంచమునకు అలవాటు. ఈ మహాప్రస్థానంలో మనం ఎక్కడినుండి వచ్చామో అక్కడికి వెళ్లిపోతాము. ఆ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారెందుకు?’ అని అడిగాడు యమధర్మరాజుగారు.

పూర్వకాలంలో ఒక చెట్టు మీద గూటిలో ఒక మగపక్షి, ఒక ఆడపక్షి ఉండేవి. ఒక బోయవాడు అటు వెళ్ళిపోతూ చెట్టుమీద మాట్లాడుకుంటున్న పక్షుల జంటను వాటి వెనకాల ఉన్న పక్షి పిల్లలను చూసి ఉండేలు బద్ద పెట్టి రాతితో ఆడపక్షి గుండెల మీద కొట్టాడు. గిరగిర తిరుగుతూ ఆ పక్షి కిందపడిపోయింది. అది మరల ఎగరకుండా ఆ పడిపోయిన పక్షి రెక్కలు వంచేసి బుట్టలో పడేసుకొని తీసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ బుట్ట కన్నాలలోంచి ఆడపక్షి నీరస పడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి భర్తవంక చూస్తోంది. అపుడు భర్త అన్నాడు “మనిద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాము. నాకేమీ సంసారం తెలియదు. రేపటి నుండి పిల్లలు లేవగానే అమ్మ ఏది అని అడుగుతాయి. నేను ఏమని సమాధానం చెప్పను? ఈ పిల్లలు ఆహరం కోసమని నోళ్ళు తెరచుకుని చూస్తూ ఉంటాయి. నీవు లేని సంసారం ఎలా చేయాను’ అని ఆడపక్షి వంక చూసి ఎదుసూ మాట్లాడుతున్నాడు. ఆడపక్షి వంక చూస్తూ మాట్లాడుతూ మైమరచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దీనీ కొట్టాడు. అది చచ్చిపోయింది. తాను ఉండిపోతాను అనుకున్న మగపక్షి చచ్చిపోయింది. రెక్కలు వంగిన ఆడపక్షి ఇంకా బ్రతికే ఉంది. కాబట్టి ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలుసు. అందుకని ఈశ్వరుని గురించి ప్రార్థన చెయ్యండి అన్నాడు.

ఈ మాటలకు దితి, హిరణ్యాక్షుని భార్యలు ఊరట చెంది అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం తపస్సుకు బయలుదేరాడు.