కృష్ణ పరమాత్మ వెన్నలన్నీ తినేసి వచ్చాడు. ఆ వచ్చిన గోపీజనమును చూసి యశోద ‘ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు? అని అడిగింది. అక్కడకు వచ్చిన గోపకాంతలు అందరూ ఒకరి తర్వాత ఒకరు కృష్ణుని మీద ఫిర్యాదులు చెప్పడం ప్రారంభించారు. ఒక గోపకాంత అన్నది

బాలురకు బాలు లేవని, బాలింతలు మొరలు వెట్ట పకపక నగి యీ

బాలుండాలము సేయుచు నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!!

‘అమ్మా యశోదా! నీవేమిటో ‘మా అబ్బాయి మా అబ్బాయి’ అని పొంగిపోతున్నావు కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? చంటి పిల్లలకి తల్లి పాలు లేకపోతే ఆవుపాలు పడతారు. బాలింతలు సాయంకాలం అవుతోంది. ఇక పిల్లాడికి పాలు పడదాం అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుపాలు వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేస్తున్నాడు. ఆ దూదలన్నీ వచ్చి ఆవుల పాలను తాగేస్తున్నాద్యి. అపుడు మీవారు ఎదురుగుండా వున్న చెట్టుకొమ్మ ఎక్కి దూడలను వదిలినందుకు మేము బాధ పడుతుంటే అతను చక్కగా నవ్వుతూ కూర్చుంటున్నాడు. మాకు దొరకడు’ అని చెప్పింది.

ఇందులో ఉండే అంతరార్థమును పరిశీలిద్దాం. మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినకపోతే నాకెందుకు అనుకుంటాం. కానీ ఈశ్వరుడు జగద్భర్త. ఈ లోకమునంతటికీ తండ్రి. ఇపుడు ఆయన రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవుదూడలు అంటే ఉపనిషత్తులు. వాటిని పోషిస్తున్నాడు. ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానమును పోషిస్తాడు. అందుకని దూడలను వదిలాడు. రెండవది ఆవులు ఎక్కడికో వల్లి గడ్డితిని కుడితి తాగి వాటిని పాలుగా మారుస్తున్నాయి. ఆవులు తమ దూడలకు పాలను ఇవ్వడానికి సంతోషంగా ఎదురు చూస్తుంటాయి. ఇంటి యజమాని వచ్చి ముందుగా దూడ దగ్గరకు వెళ్ళి దానిమెడలో వున్న ముడిని విప్పెస్తాడు. వెంటనే దూడ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆర్తితో తల్లి పాలను తాగుతుంది. పాపం, ఇంకా దూడకు ఆకలి తీరదు. వీడు ఆ దూడను లాగేసి స్తంభమునకు కట్టేసి వీడి పిల్లాడి కోసం పాలను పితకడం ప్రారంభిస్తాడు. దాని దూడ దాని పిల్ల కాదూ! నీ పిల్లాడు ఎక్కువా! కానీ ఈశ్వరునికి ఆవు తనబిడ్డే, దూడా తన బిడ్డే. అందుకని ఆయన వదిలాడు. నీవు ఆయనను వంక పెట్టడం ఎందుకు? నీవు ఆయనలలో దొంగ ఎవరు? నీవా, ఆయనా? ఆయన దొంగ కాదు. నీవు దొంగ. నీ దొంగతనం దాచుకుని చోరలీల ని ఆయనయందు దొంగతనం చెపుతున్నావు. అటువంటివారి దొంగ బ్రతుకును స్వామి బయటపెడుతున్నాడు. ఇదీ దీని అంతరార్థం.

మరొక గోపస్త్రీ –

పడతీ నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాలా

పడుచులకు బోసి చిక్కిన, కడవల బో నడిచె నాజ్ఞ గలదో లేదో?

యశోదా, నీకు అసలు క్రమశిక్షణ లేదు. నీకే లేనిది నీ పిల్లాడికి ఎలా వస్తుంది? ఏమి చేశాడో తెలుసా! మా యింట్లో పాలన్నీ ఎర్రగా కుండల్లో కాచాము. అటువంటి పాలు పిల్లలందరినీ తీసుకు వచ్చి చప్పుడు చేయకుండా కుండలను ఎత్తి ఆ పాలన్నీ తాగేసి ఆ కడవలను క్రిందపారేసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. పాలూ పోయాయి, కడవలూ పోయాయి. ఇదెక్కడి పిల్లాడు’ అంది.

ఒకరికి పెట్టడం అన్నది లేకుండా ఎప్పుడూ తమకోసమే దాచుకునే వారి యిట్లో ఐశ్వర్యమును ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. అసలు పరాయి వాడికి పెట్టడం రాని యింట్లోంచి లక్ష్మీదేవిని ఎలా తీసుకు వెళ్ళిపోవాలో నారాయణునికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకువెళ్ళి పోతాడు. కాబట్టి పరులకు పెట్టడం నేర్చుకుంటే నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది. నీవు ఏది పెట్టావో అది నీకు ఆస్తి. పుణ్యం నిన్ను కాపాడుతుంది. అదీ ఇక్కడ కృష్ణుని ఈ చర్యలోని అంతరార్థం.

ఇపుడు మరొక గోపిక లేచింది. ఈవిడ కొంచెం తెలివయినది. అప్పటికే కృష్ణుడు వచ్చి దొంగతనములు చేస్తున్నాడు అని కిందపెడితే పాలు పెరుగు తాగేసి కుండలు పగల కొట్టేస్తున్నాడు అని తెలుసుకుంది. అందుకని ఆమె తన కోడలిని పిలిచి ‘కుండలను క్రింద పెట్టకు ఉట్టి మీద పెట్టు కృష్ణుడికి అందదు’ అంది. అందరూ హాయిగా పడుకున్నారు. కృష్ణుడు వచ్చి చూశాడు. ‘అమ్మా ఎంత తెలివయిన దానివే! నీవు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు అనుకుంటున్నావా అనుకున్నాడు. ఈశ్వరుడు ఐశ్వర్యమును తీసివేయాలంటే ఎక్కడ పెడితే మాత్రం తీయలేడు! ఆయన ఎక్కడ వున్నా వెన్నను (భక్తిని) తింటాడు అని రెండవ అర్థం. ఇపుడు కృష్ణుడు రోళ్ళు, పీటలు వేశాడు. చెయ్యి అందలేదు. అందుకని కుండకు క్రింద కన్నం పెట్టాడు. అందులోంచి శుభ్రంగా మిగతా పిల్లలందరితో కలిసి వెన్న తినేశాడు. ఆ గోపస్త్రీ ‘యశోదా, నీ కడుపు పైకి కనపడదు కానీ యింత తిండి తినేసే పిల్లవాడిని ఎక్కడ కన్నావమ్మా? వెన్న పాలు చేరలు పట్టి తాగేస్తున్నాడు’ అంది.

మరొక ఆమె అమ్మా, మా యింటికి వచ్చి వెన్న, నెయ్యి తినేశాడు. ఈ యింట్లో కుండ పట్టుకువెల్లి పక్కవాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళి పోయేవాడు. వాళ్ళు లేచి చూసుకునే సరికి వాళ్ళ కుండలు పక్క ఇంట్లో ఉండేవి. వాళ్ళూ వీళ్ళూ దెబ్బలాడుకునేవారు. ఈయన వీధిలో ఆవులకి గడ్డి పెడుతున్నట్లుగా నిలబడి వీళ్ళ దెబ్బలాటని చూసి నవ్వుకునేవాడు. ఎందుకీ లీల? ఒక్కొక్కళ్ళకి తమకి సంపద ఉన్నదనే గొప్ప అహంకారం ఉంటుంది. తమ పక్కన పేదవాడు అన్నం లేక సొమ్మసిల్లి పడిపోయినా తాను మృష్టాన్న భోజనం చేసి పేదవాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోగలడు. అటువంటి వాడు నిర్దయుడు. బీదవానికి పట్టెడు అన్నం పెట్టమని అనలేడు. అలాంటి వాడి ఐశ్వర్యమును తీసివేయడమే కుండను మరొకచోట పెట్టడం. ఆయన తలుచుకుంటే వ్యక్తుల స్థానం మార్చగలడు కదా! కాబట్టి పేదవాడిని చూసి పరిహాసం చేస్తే ‘నీ పుర్రె అక్కడ పెట్టగలను – ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను. జాగ్రత్త సుమా’ అని స్వామీ మనకు ఒక పాఠమును నేర్పారు.

కృష్ణుడు ఇంకొక చోటికి వెళ్ళాడు.

ఆడంజానీ వీరల పెరు, గోడక నీసుతుడు ద్రావి యొకయించుక తా

గోడలి మూతిం జరిమిన, గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!!

ఆ ఇంట్లోకి వెళ్లి శుభ్రంగా వెన్న, నెయ్యి తినేశాడు. ఆ ఇంట్లో అత్తాకోడళ్ళు పడుకుని ఉన్నారు. వెళ్ళిపోయే ముందు ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయాడు. పొద్దుట నిద్రలేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది. నెయ్యి లేదు. కోడలు మూతివంక చూసింది. నెయ్యి ఉంది. ‘ఓసి ముచ్చా! రాత్రి నెయ్యంతా తినేశావా?’ అని కోడలిని పట్టుకుని కొట్టింది. ఈయన కిటికీలోంచి చూసి నవ్వుతున్నాడు.

అత్తకోడలికి నేర్పవలసిన గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది. ఇంటికి వచ్చిన మహాత్ములను ఆదరించడం వలన ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి ఐశ్వర్యం కోడలి వలన నిలబడాలి. వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో అత్తగారు కోడలికి నేర్పాలి. అలాకాకుండా అత్తగారు కోడలికి దుష్టచేష్టలు నేరారంటే చివరికి అది వారిద్దరి మధ్య దెబ్బలాటలకు దారితీస్తుంది. అపుడు సంసారములు చితికిపోతాయి. ధర్మమునందు పూనిక ఉండదు. కాబట్టి అత్త కోడలిని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకును పక్కన పెట్టుకోవాలి. దానం చేయడం కొడుక్కి కూడా అలవాటయి రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహా ధర్మం. అది నేర్పారు స్వామి.

ఓయమ్మ! నీకుమారుడు, మా యిండ్లను బాలు బెరుగు మననీడమ్మా!

పోయెదమెక్కడి కైనను, మాయన్నుల సురభులాన్ మంజులవాణీ!!

చివరికి వాళ్ళు ‘అమ్మా! ఇంక నీ కొడుకు మా యింట్లో పాలు, పెరుగు బతకనివ్వడు.ఈ ఊరు విడిచి వెళ్లిపోతాము’ అన్నారు.

అంటే యశోద వారిని ‘ఇవన్నీ ఎప్పుడు చేశాడు?’ అని అడిగింది. ‘ఇవన్నీ ఈవేళ పొద్దున్న చేశాడు’ అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆవిడ ;ఈవేళ పొద్దుటినుండి మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. మీరంతా నా కొడుకును గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు అందంగా ఉంటాడని, బుజ్జి కృష్ణుడని మీరు యిన్ని చాడీలు చెపుతారా! అన్నీ అబద్ధాములే’ అలా చెప్పకూడదమ్మా’ అంది. అపుడు ‘అవును ఇప్పుడెందుకు తెలుస్తుందిలే. ఇని ఇళ్ళల్లో జరిగినవి నీ ఇంట్లో జరిగినప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు ఎం చేస్తావో మేము చూస్తాము’ అని గోపికా స్త్రీలు అక్కడనుండి నిష్క్రమించారు.

ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పనిచేసుకుంటోంది. బయట బలరాముడు, ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న ఆరు గబగబా పరుగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరకు వచ్చి ‘అమ్మా అమ్మా నువ్వు ఎన్నోమాట్లు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదా! తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు’ అని చెప్పారు.

పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడతారు. కృష్ణునికి అది చాలా యిష్టం. మనకి జారత్వం చోరత్వం చాలా యిష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ రెండులీలలే చేశాడు. దొంగాట ఆడేటప్పుడు ఈయన ఎక్కడో దాక్కుని ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకునే వాడు. ఈ చర్యవలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొకచోట దాక్కున్న వాడు కృష్ణుడు నోట్లో మట్టిపోసుకోవడం చూశాడు. గోపబాలురందరూ కలిసి కృష్ణుని చేయిపట్టుకుని లాక్కుని యశోద దగ్గరకు తీసుకువెళ్ళారు. యశోద అదృష్టమే అదృష్టం. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు అరుదు. యశోద దగ్గరకు పరమాత్మ వెడితే ఆవిడ అంది

మన్నేటికి భక్షించెదు? మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ

యన్నయు సఖులును జెప్పెద, రన్నా! మన్నేల? మరి పదార్థము లేదే?

పిల్లలు చెప్పిన మాటలను ఆవిడ నమ్మేసింది. ఆయన ఏమీ తక్కువ వాడు కాదు. తిన్నాడు. యీలీల యశోద అదృష్టమును ఆవిష్కరిస్తోంది. పరమాత్మ లొంగిపోయినట్లుగా కనపడిన స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప మరొకచోట లేదు. ఆయన లోకములకన్నిటికి నడవడిని నేర్పినవాడు. ప్రపంచమునకు మార్గదర్శనం చేసిన మహా పురుషుడయిన పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది. ‘ఏరా కృష్ణా! మన్ను తినవద్దని నీకు ఎన్నిమాట్లు చెప్పాను! మన్ను ఎందుకు తింటున్నావు? నేను యింతకు ముందు నీకు ఎన్నోమాట్లు యిలా తినవద్దని చెప్పాను కదా! నీవు యిలా ఎందుకు చేశావు?’ అని అడిగింది.

అపుడు కృష్ణుడు మాట్లాడిన తీరును పోతనగారు ఎలా దర్శనం చేశారో చూడండి

అమ్మా! మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ?

నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు కొట్టంగ వీ

రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం

ధమ్మాఘ్రాణము జేసి నా వచనముల్ తప్పైన దండింపవే !!

అమ్మా, నేను మన్ను తినడమేమిటి? నేను శిశువునా? నేను వెర్రివాడనా? వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నావని అనేస్తున్నావు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ నామీద కల్పించి చెప్తున్నారు. ఆయన వేదాంతం ఎంత చెప్తున్నారో చూడండి! తన్మాత్రాలలో పృథివికి వాసన ఉంటుంది. ‘నేను నిజంగా మట్టిని తిన్న వాడనయితే పృథివిలో నుండి వాసన వస్తుంది కాబట్టి నా నోరు మట్టి వాసన రావాలి కదా! ఏదీ నా నోరు వాసన చూడు. వాసన వస్తే అప్పుడు కొట్టు’ అన్నాడు. అపుడు యశోద ‘ఏమిటి వీడు యింత తెంపరితనంగా మాట్లాడుతున్నాడు. మట్టి తినలేదంటున్నాడు. నిజం ఏమిటో యిప్పుడు పరిశీలిస్తాను’ అని కృష్ణుడిని నోరు తెరవమంది. ఏమి యశోదాదేవి అదృష్టం! ఎంతో తపస్సు చేసిన మహాపురుషులు ఎక్కడో జారిపోయి మరల జన్మములు ఎత్తారు. అంతటా నిండివున్న ఈశ్వరుని చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుని చూడడం అనేది జ్ఞానము. ఏమీ చదువుకొని స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుని యందు లోకం కనపడుతోంది. లోకము ఈశ్వరుని యందు ఉన్నది. పరమాత్మ యిప్పుడు ఈ తత్త్వమును ఆవిష్కరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండ దర్శనం. దీనినే ‘మృద్భక్షణమున విశ్వరూప ప్రదర్శనము’ అంటారు పోతనగారు.

కృష్ణుడు నోరు తెరిచాడు. సమస్త పర్వతములతో, నదులతో, సముద్రములతో, చెట్లతో, నరులతో, లోకంతో, నంద వ్రజంతో, నందవ్రజంలో వున్నా పశువులతో, తన యింటితో, తనతో, నందుడితో కలిసి అందరూ లోపల కనపడ్డారు. ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోటిలో కనపడుతుంటే ఆవిడ తెల్లబోయింది.

కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో

తలపన్ నేరకయున్నదాననో యశోదాదేవి గానో పర

స్థలమో బాలకుడింత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర

జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్!!

నోరు తెరిస్తే పిల్లవాని నోట్లో వున్నవి అన్నీ చూసి యశోద ‘ఇది కలా? వైష్ణవ మాయా? ఏదయినా సంకల్పమా? అసలు నేను యశోదనేనా? నేను నా యింట్లోనే ఉన్నానా? వీడు నా కొడుకేనా? వీని నోట్లో బ్రహ్మాండములు అన్నీ ఉన్నాయా? ఆలోచించి చూస్తె చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లవాడేమిటి? నోట్లో బ్రహ్మాండములు ఏమిటి?” అని ఆశ్చర్యపోయింది. యశోద కృష్ణుని కేవలము తన కొడుకుగా భావన పెంచుకుంది. ఈ ప్రేమయే భక్తి. తెలియకుండా ప్రేమించినా ఆమె ఈశ్వరునే ప్రేమించింది. ఇటువంటి భక్తికి పర్యవసానము జ్ఞానము. ఇదే విశ్వరూప సందర్శనము.

అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారు. అమ్మ యిలా జ్ఞానంతో ఉండిపోతే నాకు అమ్మగా ఉండలేదు. కాబట్టి మరల వైష్ణవ మాయ కప్పాలి అనుకొని ఆమె జ్ఞానమును ఉపసంహారం చేశాడు. అంతే! ఆమె వైష్ణవమాయలోకి వెళ్ళిపోయింది. ఇదే పరమాత్మ అనుగ్రహం అంటే.