నరకాసుర వధ:

కృష్ణ భగవానుడు తనంతతానుగా శక్తిమంతుడు. కృష్ణుడు లేని నాడు అష్టప్రకృతులకు కదలిక లేదు. అతి చిన్నతనంలోనే ఎందఱో రాక్షసులను పరిమార్చాడు. నరకాసురుడిని సంహరించడంలోకి వచ్చేటప్పటికీ సత్యభామను తీసుకువెళ్ళాడు. తన ఎనమండుగురు భార్యలలో ఒక్క సత్యభామను తప్ప మిగిలినవారి నెవ్వరినీ తీసుకువెళ్ళలేదు. ఇలా రామాయణంలో దశరథమహారాజుగారు కైకమ్మను తీసుకు వెడితే మనకు రామాయణం అంతా వచ్చింది. సత్యభామతో కృష్ణుడు యుద్ధమునకు వెళ్ళడం వలన మనకు దీపావళి పండుగ వచ్చింది.

ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువుతీరి ఉండగా దేవతలు ఇంద్రుడు దుర్వాసమహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ‘మహానుభావా కృష్ణా, నరకాసురుని ఆగడములు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. నరకాసురుడు దేవతలకు తల్లి అయిన అదితి కుండలములను తస్కరించాడు. వరుణుడి ఛత్రమును ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహారము చేసి మణిపర్వతమును ఎత్తుకుపోయాడు. వాని ఆగడములు అన్నీ యిన్నీ కాదు. కృష్ణా, నీవే వానిని పరిమార్చాలి’ అన్నారు. అపుడు కృష్ణుడు తాను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను’ అని చెప్పి దేవతల నందరిని సాంత్వన పరిచాడు. తరువాత తాను యుద్ధభూమికి బయలుదేరడం కోసమని రథమును ఎక్కుతున్నాడు. సరిగ్గా అదే సమయమునకు సత్యభామ అక్కడికి వచ్చింది.

సత్యభామ అనే పేరు చాలా గమ్మత్తయిన పేరు. శ్రీకృష్ణుని వద్ద సత్యభామ పొందిన స్థానం చాలా గొప్పది. సత్యభామ అనేక రంగములలో ప్రవీణురాలు. ఆ తల్లి కృష్ణ భగవానుని దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది. ‘నాథా, మీతో యుద్ధ భూమికి వద్దామనుకుంటున్నాను’ అంది. కృష్ణ పరమాత్మ అన్నారు – ‘ సత్యభామా! యుద్ధం అంటే ఏమిటో సరదాగా ఉంటుందని అనుకుంటున్నావు. రోజూ నాతొ ప్రణయ విలాసాలతో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావు. యుద్ధభూమి అంటే తుమ్మెదల ఝుంకారములు వినపడవు. బ్రహ్మాండమయిన ఏనుగులు తొండములను ఎత్తి ఘీంకారములు చేస్తుంటాయి. అక్కడ పద్మములనుండి వచ్చే పుప్పొడితో కూడిన గాలి రాదు. శరవేగంతో పరుగెత్తే గుర్రములు యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కలనుండి పైకి రేగిన ధూళి వచ్చి మీద పడుతుంది. అక్కడ సరోవరముల నుండి వచ్చే చల్లని గాలి రాదు. శత్రువులు విడిచి పెట్టిన బాణపరంపరలు వచ్చి మీదపడిపోతాయి. అక్కడ కలహంసలు మొదలయిన పక్షులతో కూడిన సరోవరములు ఉంటాయని నీవు అనుకుంటున్నావేమో భయంకరమయిన శత్రువులు రాక్షసులతో కూడిన యుద్ధభూమి ఉంటుంది. నేను రాక్షసులను పరిమార్చి తిరిగి తొందరగా వచ్చేస్తాను. నీవు నాతో రావద్దు’ అన్నారు.

అపుడు సత్యభామ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయన చెవిలోకి మాత్రమే వినపడేటట్లుగా ఎంతో ప్రియముగా చక్కటి మాట చెప్పింది. ఆయుద్ధభూమిలో ఉన్నవారు రాక్షసులే అయినా అక్కడ దైత్య సమూహములే ఉన్నా నాకేమీ భయం లేదు. నీ భుజములనబడే దుర్గముల చాటున నేను ఉంటాను. నీ యుద్ధం చూడాలని అనుకుంటున్నాను. అని ప్రార్ధన చేసింది. కృష్ణ పరమాత్మ ఆమెను యుద్ధ రంగమునకు తీసుకువెళ్ళడానికి అంగీకరించాడు. ఇద్దరూ గరుత్మంతుని అధిరోహించి యుద్ధభూమిని వెళ్ళారు.

ప్రాగ్జ్యోతిషపురమునకు చేరుకున్నారు. అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు ఉన్నారు. హయగ్రీవుడు అంటే లక్ష్మీ హయగ్రీవుల అవతారంలోని హయగ్రీవుడు కాదు. ఇక్కడ చెప్పబడిన హయగ్రీవుడు రాక్షసుడు. అక్కడ దుర్గములు చాలా ఉన్నాయి. పరమాత్మా ఒక్కసారి తన చేతిలో పట్టుకున్న గద చేత ప్రహారము చేస్తూ ఆ దుర్గములనన్నిటినీ నేలకూల్చేశాడు. పాంచజన్యమును చేతిలో పట్టుకొని ప్రళయ కాలంలో మేఘము ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యమును పూరించారు. మురాసురుడు అక్కడ ఉన్న జలదుర్గంలో పడుకుని నిద్రపోతున్నాడు. పెద్ద జడ వేసుకున్నాడు. వాడు ప్రాగ్జ్యోతిష పురమును మురాపాశములతో కట్టి ఉంచుతాడు. కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాశములను ఖండించారు. మురాసురుడు పైకి వచ్చాడు. తన అయిదు తలలతో వాడు బ్రహ్మాండములో ఉన్నటువంటి పంచ భూతములను మ్రింగివేసేలా ఉన్నాడు. వాని జడ సాగిన అగ్నిహోత్రంలా ఉంది. అటువంటి జడతో వాడు నీటిలోనుండి పైకి లేచి కృష్ణుని వంక చూశాడు. పరమాత్మ తన గదా ప్రహారముతో మురాసురుని శిరస్సుని బ్రద్దలు చేశాడు. వాడు మరణించాడు. మురాసురుడు మరణించగానే వాని కుమారులు ఏడుగురు కృష్ణ పరమాత్మ మీదికి యుద్ధమునకు వచ్చారు. ఆ ఏడుగురిని కూడా కృష్ణ పరమాత్మ నిర్మించారు. ఈవార్త నరకాసురుడికి చేరి యుద్ధమునకు వచ్చాడు.

నరకాసురుడు ఆదివరాహ మూర్తికి భూదేవికి కలిపి జన్మించిన వాడు. వాడు పధ్నాలుగు భువనములను గెలిచినవాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గభాలున లేచి ముందుకు వచ్చింది.

తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడివేసింది. తను వేసుకున్న హారములు అవీ బయటకు వ్రేలాడకుండా అమరిక చేసేసుకుంది. ఆమెలో ఎక్కడ భయం కనపడడం లేదు. ముఖం దేదీప్యమానం అయిపోతూ ఉండగా పమిట వ్రేలాడకుండా బొడ్డులో దోపుకుంది. కృష్ణుని ముందుకు వచ్చి ‘నాథా, ధనుస్సును ఇలా యివ్వండి’ అని అడిగింది. కృష్ణుడు తెల్లబోయాడు. ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకు తెలియనివి ఏమి ఉంటాయి.

రాక్షసుల మస్తకమును ఖండించడానికి అనువయిన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ధనుస్సును స్వామి సత్యభామ చేతికి ఇచ్చారు. ఆ ధనుస్సును ఎడమచేతితో పట్టుకుని ఒంచి వింటినారిని విప్పి వంగి కుడిచేతితో కట్టింది. ఈ దృశ్యమును చూసి కృష్ణ పరమాత్మలో పాటు రాక్షసులు కూడా తెల్లబోయారు. ఆ ధనుస్సును పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే యుద్దమును ప్రారంభించి ఒక్కొక్క బాణము తీసి అభిమంత్రించి విడిచి పెడుతోంది. ఆవిడ ఒక్కొక్క బాణమును తీసి తొడుగుతుంటే వీర రసము, శృంగార రసము, భయ రసము, రౌద్ర రసములు ఆమెలో తాండవిస్తున్నాయి. రానురాను యుద్ధం పెరిగిపోతోంది. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో వీరులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణములను ప్రయోగించడం ప్రారంభించారు. ,మూడు లోకములలో ఉన్నవాళ్ళు తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్లుగా సత్యభామ యుద్ధం చేస్తోంది.

భయంకరమయిన యుద్ధం చేసి చెమట పట్టేషి ముంగురులన్నీ నుదుటికి అన్తుకుపోయిన సత్యభామ వంక చూసి కృష్ణుడు ‘సత్యా, నీ యుద్ధమునకు నేను ఎంతో పొంగిపోయాను. అని ఆ ధనుస్సు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులయి పోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణములతో నిలబడి ఉన్నాడు. అపుడు నరకాసురుడు అన్నాడు ‘చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తుంటే నీవు పక్కన కూర్చున్నావు. పౌరుషం ఉన్నవాడివైతే యిప్పుడు యుద్ధమునకు రావలసింది’ అన్నాడు. ఈమాటలు విన్న నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చాను’ అని తన చేతిలో వున్న సుదర్శన చక్రమును ప్రయోగించారు. ప్రయోగించగానే సుదర్శన చక్రధారల చేత త్రుంపబడిన నరకాసురుని శిరస్సు కుండలములు ప్రకాశిస్తూ ఉండగా దుళ్ళి నేలమీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాదనే పరమ సంతోషంతో దేవతలు అందరూ వారి వారి లోకములయందు దీపములను వెలిగించారు. వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడు. అందుకనే మనం దీపావళి అమావాస్య అంటాము.

దీని వెనకాతల ఉండే రహస్యమును మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. యథార్థమునకు నరకాసురుడు అనేవాడు మనలోనే ఉంటాడు.నరకాసురుడు ఆదివరాహ మూర్తికి, భూదేవికి జన్మించాడు. అనగా ప్రకృతి పురుషుల సంయోగ ఫలితమే నరకాసురుడు. భూదేవి అతని తల్లి. ప్రాక్ – జ్యోతి అనగా మొదటి నుండి వున్న జ్యోతి – అనగా ఇక్కడే ఉన్న ఆత్మా వస్తువు. ఈ ఆత్మా వస్తువును తెలుసుకోవడానికే మనం ఈ శరీరంలోకి వచ్చాము. ఇందులోకి రాగానే వాడు ప్రాగ్జ్యోతిషపురమునకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు. మాహిష్మతీ పురమునకు వెళ్ళాడు. మాహిషి అనగా మహిష ప్రవృత్తి –దున్నపోతు లక్షణం. వాడు మురాసురుడు, నిశుంబుడు, హయగ్రీవుడు అనబడే ముగ్గురు స్నేహితులను పట్టుకున్నాడు. సత్వరజస్తమో గుణములనే మూడు గుణములతో స్నేహమును ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడూ ఈ మూడు గుణములలో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురమునుంది మాహిష్మతీ పురమునకు వచ్చేశాడు.

బ్రహ్మగారి గురించి తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై’నీకు ఏమి కావాలి’ అని అడిగారు. ఇది భాగవతం లోనిది కాదు. తనకు మరణం ఉండకూడదని అన్నాడు. ‘కుదరదు మరొకవరం కోరుకొనమ’ని చెప్పారు. వాడు ఏమి అడుగుదామా అని ఆలోచిస్తుండగా బ్రహ్మగారు ‘అమ్మ చేతిలో చచ్చిపోయేలా నీకు వరం యిస్తాను, పుచ్చుకుంటావా’ అని అడిగారు. అంటే వాడు అనుకున్నాడు ‘అమ్మకి పెంచడం తెలుసు తప్ప చంపడం తెలియదు కదా! కాబట్టి నాకు చావు ఉండదు అని భావించాడు. ఆ మేరకు బ్రహ్మగారి వద్దనుండి వరమును పొందాడు. తాను అమ్మచేతిలో పోతాడు కాబట్టి తన తల్లి ఎవరు అని వెతకడం మొదలు పెట్టాడు. తెలుసుకోలేక అదితి కుండలములను అపహరించాడు. ఆకాశమునకు ప్రకాశించే రెండు కుండలములు సూర్య చంద్రులు. వాటిని దొంగిలించాను, కాలము యొక్క ప్రసరణ తనమీద లేదన్నాడు. తనకు మరణం లేదన్నాడు.

మాయ అనగా ప్రకృతి. ప్రకృతి అంటే పధ్నాలుగు భువనములు. అవే చతుర్దశి. చతుర్దశీ కన్యను వివాహం చేసుకున్నాడు. అనగా 14 భువనముల మాయకు చిక్కి ఈ భోగ భాగ్యములన్నీ శాశ్వతము అనుకున్నాడు. అనేకమంది రాజుల దగ్గరికి వెళ్లి వారిని చంపి ఆ పిల్లలను తీసుకువచ్చే వాడు. తాను తెచ్చిన ఏ స్త్రీనీ అనుభవించలేదు. కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిన తరువాత కృష్ణ పరమాత్మ వారిని ద్వారకానగరం పంపించి వేసి యింద్రుడి దగ్గరకు వెళ్లి వచ్చిన తరువాత ఈ 16 వేల మందికి 16వేల అంతఃపురములను కట్టి ఏకముహూర్తము నందు ఒకే కృష్ణుడుగా కనపడుతూ 16వేల రూపములతో వివాహం చేసుకున్నాడు. 16వేలమందిని చెరసాలలో పెట్టడం అంటే ఈశ్వరుని పదహారు కళలు. బ్రహ్మగారి వరం ప్రకారం నరకాసురుడు తల్లి చేతిలోనే చచిపోవాలి. ఆ భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది.

సత్య అనగా మారనిది అని అర్థం. ఈ ప్రపంచంలో మారానికి పరమేశ్వరుడు మాత్రమే. మారని వాడు సత్యము అయితే ఆ సత్యము ‘భా’ – అనగా కాంతి – ‘మ’ అనగా సంపద – సత్యము కాంతి వలన వచ్చే సంపద. ఇది మనకు భూమిలో కనపడుతుంది. భా – ఈశ్వరుడు ‘మ’ – సంపద. సత్యభామ – భూదేవి – ఐశ్వర్యం.

గరుత్మంతుని మీద కృష్ణుని పక్కన సత్యభామగా కనపడుతున్నది ఈశ్వరుని సోత్తయిన భూసంపద. లక్ష్మీ అంశ రుక్మిణి, భూ అంశ సత్యభామ. సత్యభామాదేవి వృత్తాంతమును ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మ జ్ఞానము ఒక జన్మలోనయినా కలుగుతుంది. సత్య-భ-మ ఈశ్వరుడి కాంతి సంపద యుద్దమును వింటున్నారు. ఆ యుద్ధము అజ్ఞానము మీద ఉంటుంది. కాబట్టి అది విన్నవాడు జ్యోతినే పొందుతాడు. మనకోసమని పరమాత్మ నరకాసుర సంహారంలో ఇంత గొప్ప లీల చేశాడు.