సూతుడు ఈవిధంగా చెప్పారు. ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు పల్వలుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మేము చేసే యజ్ఞయాగాదులను పాడుచేస్తూ ఉంటాడు. మేము యజ్ఞం మొదలుపెట్టి అరణి మంథనం చేసి అగ్నిహోత్రం తీసుకువచ్చి యజ్ఞవేదిలో పెట్టి హవిస్సు ఇవ్వడం మొదలుపెట్టగానే వాడు ఆకాశంలోకి వచ్చేస్తాడు. మలమూత్రములు, రక్తము యివన్నీ తెచ్చి అగ్నిహోత్రంలో వేస్తాడు. వేదిలో ఉన్న అగ్నిహోత్రం చల్లారిపోతుంది. అపుడు వాడు పెద్దగా పకపకనవ్వేసి వెళ్ళిపోతాడు. అందుకని నీవు పల్వలుని సంహరించు. అపుడు మేము యజ్ఞ యాగాదులను ఆటంకం లేకుండా చేసుకుంటాము’ అని చెప్పారు. ఋషులు పల్వలుని సంహరించమని బలరాముని కోరిన కోరిక చాలా అర్థవంతమయిన కోరిక. బలరాముడు వెంటనే వెళ్లి పల్వలుని చంపలేదు. అతడు ‘ఏమి చేస్తాడు’ అని అడిగాడు. ‘మేము యజ్ఞం చేస్తే పాడుచేస్తాడు’ అని ఋషులు చెప్పారు. అయితే మీరు యజ్ఞం చేయడం ప్రారంభించండి. వాడు వచ్చినట్లయితే సంహరిస్తాను అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞమును ప్రారంభించారు. పల్వలుడు వచ్చినట్లయితే సంహరిస్తాను’ అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞమును ప్రారంభించారు. పల్వలుడు వచ్చి యజ్ఞ గుండంలో మలమూత్రములను విసరడం ప్రారంభించాడు. బలరాముడు చూశాడు. వెంటనే ఎడమచేతితో నాగాలితీసి వాడి తలకాయకు వేసి కిందికి లాగాడు. కుడిచేత్తో రోకలి పుచ్చుకుని తలమీద ఒక దెబ్బ కొట్టాడు. నెత్తురు బుగబుగ కక్కుకుంటూ పల్వలుడు మరణించాడు. తరువాత బలరాముడు ‘నేను పల్వలుని చంపివేశాను. మీరు యజ్ఞ యాగాదులు చేసుకుంటారు. కానీ యింకా నేను చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది. ఇంతకుపూర్వం నేను చేసిన పాపములు పోవడానికి ఈ పనులు చేశాను. ఇపుడు నేను కొంత పుణ్య బలమును సమకూర్చుకోవాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచిపనులు ఏమయినా చెప్పండి అని అడిగాడు. అపుడు ఋషులు ‘నీవు పన్నెండు నెలలు యింటి ముఖానికి వెళ్ళకుండా దేశం అంతా తిరిగి పుణ్య తీర్థములు అన్నిటిలో స్నానం చెయ్యి. అప్పుడు నీ మనసు ప్రశాంతత పొంది, పుణ్యమును పొంది సత్త్వ గుణమును పొందుతావు. మనస్సునందు పాపపు ఆలోచన అహంకారము పైకిరావు. వినయముతో నిలబడగలుగుతావు’ అన్నారు. బలరాముడు అప్పుడు బయలుదేరి పుణ్య తీర్థములలో స్నానము చేశాడు.

మనం పుణ్య క్షేత్రములకు ఎందుకు వెళ్ళాలో ఎందుకు తీర్థములందు స్నానం చేస్తామో ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావుడు చిన్నదయినా సరే యింత పరమపవిత్రమయిన ఈ ఆఖ్యానమునందు పొందుపరచారు.

వృకాసురుడు విష్ణుమాయచే మడియుట:

పూర్వం వృకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆటను శకుని కుమారుడు (భారతంలో శకుని కాదు) ఒకరోజున వాడు వెళ్లిపోతుంటే నారదుడు అటుగా వచ్చాడు. అపుడు వాడు నారదుని చూసి నమస్కరించాడు. నారదుని కాళ్ళకి దణ్ణం పెట్టాడు. తరువాత నారదుడిని ‘అయ్యా నారదా, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అని ముగ్గురు పరమాత్మ రూపములు ఉన్నారని చెపుతారు కదా – ఈ ముగ్గురిలో నేను తపస్సు చేస్తే తొందరగా ప్రత్యక్షమయి నేను కోరిన వరమును యిచ్చేసే ఆయన ఎవరు?’ అని అడిగాడు. అపుడు నారదుడు – ‘వృకాసురా, బ్రహ్మగారు సృష్టి చేస్తారు. ఆయన గురించి చాలా తపస్సు చెయ్యాలి. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అవాలి అంటే సత్త్వ గుణంలోకి వచ్చెయ్యాలి. ఆయన మోక్షం అడిగేవారి కోసం వస్తాడు. నీజాతి వాళ్ళందరికీ తొందరగా ప్రత్యక్షం అయ్యే ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన పరమశివుడు. ఆయన భక్తులకు చాలా తెలికవా వశుడవుతాడు. అందుకని శివుని గురించి తపస్సు చెయ్యి అని చెప్పాడు. అపుడు వృకాసురుడు ‘తపస్సు ఎక్కడ చెయ్యను’ అని అడిగితె కేదారంలో చేయమని నారదుడు చెప్పాడు. అందుకని వృకుడు కేదారం వెళ్లి శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు.

కొద్దికాలం తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షం కాలేదు. వానికి అక్కసు వచ్చింది. తన శరీరమును తానే ముక్కలుగా నరుక్కుని అగ్నిలో వ్రేల్చేశాడు. చివరకు తన శిరస్సును ఖండించుకుని అగ్నిహోత్రంలో వేయడానికి సిద్ధపడ్డాడు. అపుడు శంకరుడు వెంటనే వచ్చి వృకుడు ఆ పని చేయకుండా అడ్డుపడి ‘నీకు ఏమి కావాలో కోరుకో’ అన్నాడు. అపుడు వృకుడు ‘శంకరా నేను నా చేతిని ఎవరి తలమీద పెడితే వాడి తల పగిలిపోయేటట్లు నన్ను అనుగ్రహించు’ అని కోరాడు. వీని కోరిక విని శివుడు తెల్లబోయాడు. ‘సరే తథాస్తు; అన్నాడు.

ఇపుడు వాడు తొందరగా ఎవరో ఒకడి తలమీద తన చేయిని పెట్టాలని అనుకున్నాడు. ‘శంకరా, నీ తలమీద ఒకసారి చేయి పెడతాను నిలబదవలసింది’ అన్నాడు. ఆయన వృకునకు తల ఇవ్వలేక వెనక్కి తిరిగి పరుగెత్తడం మొదలు పెట్టాడు. అసలు అలా వెళ్ళడం వెనకాతల ఒక రహస్యం ఉంది. సుబ్రహ్మణ్యుని ఉత్పత్తి జరగడానికి కావలసిన బీజం అక్కడ అప్పుడు పడింది.

శివుడు అలా పరుగెత్తి వైకుంఠమునకు వెళ్ళాడు. శివుడు వెనకాలే వృకుడు ఆగుఆగు అంటూ పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. శివునికి కేశవునికి భేదం ఉండదు. శంకరునిగా వృకుడి అజ్ఞానమును అణచి వేస్తె బాగుండదు. శంకరుడు నారాయణునిగా వృకుడి అజ్ఞానమును అణచాలి. శంకరుడు వైకుంఠం వెళ్లేసరికి అందులోనుండి శ్రీమన్నారాయణుడు ఒక వటువు రూపంలో ఒక బంగారు మొలత్రాడు, పచ్చటి గోచి మూడు పోగులు వున్న యజ్ఞపవీతం వేసుకుని చక్కగా ఒక కమండలం చేత్తో పట్టుకుని బ్రహ్మచారిగా బయటకు వచ్చాడు.

వటువు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు పరుగెత్తుకు వస్తున్నవృకాసురుని చూసి ‘’అయ్యో వృకాసురా, అలా పరుగెత్తుకు వస్తున్నావేమిటి? నీ ఒళ్ళంతా చెమట పట్టేసింది. శరీరమును సుఖ పెట్టుకోవడానికి వాడుకోవాలి. ఎందుకు అలా పరుగెడుతున్నావు ఆగు’ అన్నాడు. అపుడు వృకాసురుడు రొప్పుతూ శంకరుడు వరం యిచ్చాడు. తలమీద చెయ్యి పెడదామంటే పారిపోతున్నాడు’ అన్నాడు. అపుడు నారాయణుడు వృకాసురా నీవు ఎంత పిచ్చివాడవు. దక్ష ప్రజాపతి యజ్ఞం పూర్తయిన నాటినుండి శంకరుని ప్రవర్తనలో మార్పు వచ్చింది. పిశాచములను భూత గణములను వెంట పెట్టుకు తిరగడం, అబద్ధాలాడడం మొదలుపెట్టాడు. ఆయన మాట సత్యం కాదు. పైగా మహేశ్వరుడి దగ్గర ఒక గుణం ఉంది. ఆయన పవిత్రుడు కదా! నువ్వు స్నానం చెయ్యకుండా ఆయనను ముట్టుకుందామంటే ఆయన తల ఇవ్వడు. ఆయన లొంగిపోయే మనిషే. కానీ నువ్వు స్నానం చేసి ముట్టుకుంటే ఆయన లొంగిపోతాడు. నువ్వు అక్కడ కనిపిస్తున్న మడుగులో స్నానం చేసి ఆచమనం చేసి అపుడు శంకరుని తలమీద చెయ్యి పెట్టు’ అన్నాడు. అలాగేనని వృకుడు స్నానం చేసి ఆచమనం చేస్తూండగా పొరపాటున అతని చేయి అతని శిరస్సుకి తగిలింది. వెంటనే వాడు తలపగిలి కిందపడి చచ్చిపోయాడు.

‘మనుష్యులు కోరికలు కావాలి అని కోరికలు అడుగుతారు. కోరిక తీరితే తన కోరిక తీరిందని ఈశ్వరునికి కృతజ్ఞత చెప్పరు. వెంటనే భగవంతుడిని మరచిపోతారు. నా అంతటి వాడిని నేను అనుకుంటారు. నేనే అవన్నీ చేశానని అహంకారమును పొందుతారు. తాను ఏ పని చేసినా, ఏ విజయమును పొందినా అది ఈశ్వర కృప వలననే జరిగినది అని భావించగలిగితే అతడు కృతార్థుడు అవుతాడు’ అని ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు ఈ కథను భాగవతంలో చెప్తారు. వెర్రి పెట్టుకోకుండా ఈశ్వర స్వరూపమును మీరు నమ్మడం నేర్చుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారు అని ఒక అద్భుతమయిన ఆఖ్యానమును ఈశ్వరుడు ఆవిష్కరించి ఉన్నాడు.